Marriage Registration: వివాహం తర్వాత దానిని నమోదు చేసుకునే ప్రక్రియ భారతీయ సంప్రదాయంలో లేకపోయినా.. కొన్ని కొన్ని విషయాల్లో భార్యాభర్తల బంధాన్ని ధృవ పరస్తూ నమోదు చేసుకోవలసి వస్తుంది. దీంతో కొత్త జంట పెళ్లి తర్వాత నమోదు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ ఆఫీసుల బాట పట్టాల్సి వస్తుంది. అయితే ఇటువంటి నూతన దంపతులకు దేశ రాజధాని ఢిల్లీ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. పెళ్లి చేసుకున్న తర్వాత కొత్త జంట తమ వివాహం నమోదు చేసుకోవడానికి ప్రత్యక్షంగా హాజరుకావాల్సిన అవసరం లేదని.. ఆన్ లైన్ లోనే పెళ్లిని నమోదు చేసుకుని మ్యారేజ్ సర్టిఫికెట్ పొందవచ్చు అని తెలిపింది. దీనికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దంపతులు హాజరైతే చాలని ఆదేశాలు జారే చేసింది.
ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం.. 2001లో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిన దంపతులు. ఈ దంపతులు అమెరికాలో గ్రీన్ కార్డు అప్లై చేసుకోవడానికి ఇప్పుడు వారికి మ్యారేజ్ సర్టిఫికేట్ కావాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు వారు భారత దేశానికి వచ్చి సర్టిఫికెట్ తీసుకునే పరిస్థితులు లేవు.. దీంతో తమ కుటుంబ సభ్యుల ద్వారా భారత్ లో పెళ్లి సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించారు. అయితే అధికారులు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కోసం దంపతులు కచ్చితంగా ప్రత్యక్షంగా హాజరవ్వాలని స్పష్టం చేశారు.
దీంతో ఆ దంపతులు ఢిల్లీలోని హైకోర్టును ఆశ్రయించారు. తాము పెళ్లి చేసుకున్నప్పుడు ఢిల్లీ లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ ఆదేశాలు లేవని, ఇప్పుడు తీసుకోవడం కష్టమవుతున్నదని పిటిషనర్లు కోర్టు కు తెలిపారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ రేఖా పల్లి.. రిజిస్ట్రేషన్ ఆర్డర్‌లోని క్లాస్ 4 ప్రకారం దంపతులు ప్రత్యక్షంగా హాజరవ్వాలని చెప్పారు. అయితే ఆ దంపతులు వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా హాజరుకావచ్చని.. చెప్పారు. అలాగా కాదు ప్రత్యక్షంగా దంపతులు హాజరు కావాలంటూ.. అధికారులు పట్టుబడితే.. ఈ రూల్ ని తీసుకువచ్చిన చట్టమే పక్కదారి పడుతుందని రేఖా పల్లి వ్యాఖ్యానించారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవ్వడంతో దంపతులు సులువుగా మ్యారేజ్ సర్టిఫికేట్ పొందడానికి వీలుందని వ్యాఖ్యానించారు.