Viral News: అమ్మలా బాధ్యత తీసుకున్న ఓ పదేళ్ల చిన్నారి.. తన రెండేళ్ల చెల్లిని చంకన కూర్చోబెట్టుకోని బడిలో శ్రద్ధగా పాఠాలు వింటున్న ఫోటోపై తాజాగా స్పందించారు మణిపూర్ మంత్రి బిశ్వజీత్ థోంగమ్. పాపను ఒల్లో కూర్చొబెట్టుకుని శ్రద్ధగా పాఠాలు వింటున్న బాలిక తీరుకు అక్కడి ఉపాధ్యాయులు, నెటిజన్స్ సైతం ముచ్చటపడ్డారు. దీంతో ఆమె ఫోటోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. చివరకు ఈ ఫోటోలు రాష్ట్ర మంత్రికి చేరడంతో ఆయన కూడా మురిసిపోయి.. చిన్నారికి సాయం చేయడానికి ముందుకొచ్చారు. ముద్దులొలికే మణిపూర్ బాలిక మెనింగ్‌సిన్‌లియు పమేయ్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్ముమోగుతోంది.
పదేళ్ల చిన్నారి అంకితభావాన్ని మెచ్చుకున్న మంత్రి బిశ్వజీత్ థోంగమ్.. ఆమె కుటుంబం కోసం ఆరా తీశారు. ఆచూకీ తెలుసుకుని బాలికను రాజధాని ఇంఫాల్ తీసుకురావాలని, ఆమె కోసం బోర్డింగ్ స్కూల్ సిద్ధంగా ఉందని ఈ మేరకు కుటుంబసభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, బాలిక గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేవరకు తానే బాధ్యత తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. చిన్నారి చదువు కోసం వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటానని, బాలిక అంకితభావానికి గర్వపడుతున్నానని అన్నారు.