ప్రెగ్నెంట్ చేస్తే 10 నుంచి15 లక్షలు! నమ్మితే.. పోయాం మోసం అనక తప్పదు!

బీహార్ రాష్ట్రంలో ఓ కొత్త సైబర్ స్కాం వెలుగుచూసింది. ఈ స్కాంలో మొదట ‘బిడ్డలు లేని మహిళలను గర్భవతులను చేస్తే రూ.10 నుంచి 15 లక్షల వరకు ఇస్తాం’ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు మోసగాళ్లు. ఈ స్కామ్‌కు “ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్” అనే పేరు పెట్టారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలపై ప్రకటనలు ఇచ్చారు. ఈ మోసం ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రెగ్నెంట్ చేస్తే 10 నుంచి15 లక్షలు! నమ్మితే.. పోయాం మోసం అనక తప్పదు!
Pregnant

Updated on: Jan 10, 2026 | 7:24 PM

ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. సరికొత్త మోసాలకు తెరతీస్తూ డబ్బులు కాజేస్తున్నారు. సులభంగా డబ్బు వస్తుందనే ఆశతో వెళితే.. ఉన్నది ఊడ్చేస్తున్నారు. తాజాగా, దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న వింత ఉద్యోగ స్కాం వెలుగు చూసింది.

ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్

‘బిడ్డలు లేని మహిళలను గర్భవతులను చేస్తే రూ.10 నుంచి 15 లక్షల వరకు ఇస్తాం’ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు మోసగాళ్లు. ఈ స్కామ్‌కు “ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్” అనే పేరు పెట్టారు మోసగాళ్లు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలపై తక్కువ పని.. భారీ ఆదాయం అంటూ ఆకర్షణీయ ప్రకటనలు ఇచ్చి ముఖ్యంగా యువకులను, నిరుద్యోగులను టార్గెట్ చేస్తున్నారు.

మోసం ఇలా

మొదట చిన్న మొత్తంలో రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించమని చెబుతారు. ఆ తర్వాత సెక్యూరిటీ డిపాజిట్, లీగల్ ఛార్జీలు, జీఎస్టీ అంటూ దశలవారీగా డబ్బులు వసూలు చేస్తారు. డబ్బులు చెల్లించిన వెంటనే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తారు, వాట్సాప్ నంబర్లు బ్లాక్ చేస్తారు. ఇలా బాధితుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చివరకు బాధితులు తాము మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటారు. కొందరు పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

బీహార్‌లో వెలుగులోకి.. దేశవ్యాప్తంగా బాధితులు

ఈ స్కామ్ ప్రధానంగా బీహార్‌లో వెలుగులోకి వచ్చినప్పటికీ.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా పలువురు బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ క్రైం విభాగం ఈ కేసును తీవ్రంగా పరిశీలిస్తోంది.

పోలీసుల చర్యలు

ఈ మోసానికి సంబంధించి పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ తరహా అసంబద్ధమైన, చట్టవిరుద్ధమైన ఉద్యోగ ఆఫర్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ప్రజలకు హెచ్చరిక

ఉద్యోగం పేరుతో డబ్బులు అడిగితే అది మోసమే అని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఇస్తామన్న ప్రకటనలను నమ్మకుండా, అనుమానాస్పద లింకులు లేదా కాల్స్‌ను వెంటనే సైబర్ క్రైం పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.