ఘోర ప్రమాదం.. ఆలయ పైకప్పు కూలి ఏడుగురు భక్తులు మృతి

మహారాష్ట్రలోని పర్భణీ జిల్లా యశ్వాడి హనుమాన్ టెంపుల్ వద్ద నిర్మాణంలో ఉన్న సభా మండపం శనివారం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో పలువురు భక్తులు గాయపడగా, ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం. 40-45 మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతుండగా, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ఘోర ప్రమాదం.. ఆలయ పైకప్పు కూలి ఏడుగురు భక్తులు మృతి
Parbhani Temple Collapse

Updated on: Jun 20, 2026 | 5:43 PM

మహారాష్ట్రలోని పర్భణీ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వద్ద నిర్మాణంలో ఉన్న సభా మండపంలోని ఒక భాగం శనివారం అకస్మాత్తుగా కూలిపోవడంతో ఏడుగురు భక్తులు చనిపోగా,  పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయి ఉండవచ్చనే అనుమానాలతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

శనివారం కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దర్శనం కోసం పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు సభా మండపం సమీపంలో ఉండగా, నిర్మాణంలో ఉన్న పైకప్పు భాగం, దానికి మద్దతుగా ఉన్న స్తంభం ఒక్కసారిగా కూలిపోయాయి. దీంతో అక్కడ తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఘటన జరిగిన వెంటనే స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని బయటకు తీశారు. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందినట్లు సమాచారం. అలాగే శిథిలాల కింద 40 నుంచి 45 మంది భక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఎవరైనా మరణించారా అనే విషయాన్ని అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

సభా మండపం నిర్మాణ పనులు గత కొన్ని రోజులుగా కొనసాగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదం నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాల అమలుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. నిర్మాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారా? నిర్మాణ సామగ్రి నాణ్యత ఎలా ఉంది? అనే అంశాలపై విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు, రెస్క్యూ బృందాలు శిథిలాలను తొలగిస్తూ సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. కూలిపోయిన ఘటనకు గల ఖచ్చితమైన కారణాలు, ప్రభావితుల సంఖ్య, నష్టపరిస్థితులపై మరిన్ని వివరాలు అధికారిక నివేదిక వెలువడిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Follow Us