
మహారాష్ట్రలోని పూణే నగరంలోని ఒక రద్దీ సాయంత్రం. వీధులన్నీ వాహనాల రొదతో, మనుషుల హడావిడితో నిండిపోయి ఉన్నాయి. ‘సూపర్‌బ్రో’ అనే సోషల్ మీడియా యూజర్ తన స్నేహితుడితో కలిసి నడుస్తూ, రోడ్డు పక్కన ఉన్న ఒక పండ్ల దుకాణం వద్ద ఆగారు. కేవలం మూడు అరటిపండ్లు కొన్నారు, వాటి ధర 15 రూపాయలు. అయితే, ఆ చిన్న లావాదేవీ ఒక మర్చిపోలేని గుణపాఠంగా మారుతుందని వారు ఊహించలేదు.
పండ్లు తీసుకున్న సదరు యువకుడు, తన స్నేహితుడితో మాటల్లో పడి మొబైల్ స్క్రీన్‌ను సరిగ్గా గమనించకుండానే UPI ద్వారా డబ్బులు చెల్లించారు. పొరపాటున 15 రూపాయలకు బదులుగా 1,515 రూపాయలు టైప్ చేసి, పిన్ ఎంటర్ చేసి అక్కడి నుండి ముందుకు సాగిపోయారు. తన ఖాతా నుండి సుమారు వంద రెట్లు ఎక్కువ డబ్బు కట్ అయిందన్న విషయం ఆ యువకుడికి అస్సలు తెలియదు.
కొంత దూరం వెళ్ళాక, వెనుక నుండి ఎవరో గట్టిగా అరుస్తున్నట్లు అనిపించింది. ట్రాఫిక్ గోలలో మొదట అది తన కోసమే అని అతను గుర్తించలేదు. కానీ, ఆ కేకలు ఆగకపోవడంతో వెనక్కి తిరిగి చూసి ఆశ్చర్యపోయారు. ఇందాక తాను పండ్లు కొన్న వ్యాపారి ఆయాసపడుతూ తన వెనుకే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. “బాబు.. మీరు పొరపాటున ఎక్కువ డబ్బులు పంపారు, ఇదిగో మీ మిగిలిన సొమ్ము తీసుకోండి” అంటూ ఆ వ్యాపారి వెంటనే తన మొబైల్ తీసి అదనంగా వచ్చిన మొత్తాన్ని తిరిగి బదిలీ చేసేశాడు.
అంతేకాకుండా, “ఆన్‌లైన్ చెల్లింపులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి నాయనా, ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి” అని హితవు కూడా పలికాడు. అపరిచితుల మధ్య నమ్మకం కరువవుతున్న ఈ కాలంలో, ఆ పేద వ్యాపారి చూపిన నిజాయితీ ఆ యువకుడిని నివ్వెరపోయేలా చేసింది.
ఇందుకు సంబంధించి సోషల్ మీడియా ‘X’ వేదికగా పంచుకోగా, అది క్షణాల్లో వైరల్ అయింది. “నిజాయితీ ఇంకా బ్రతికే ఉంది” అని నెటిజన్లు ఆ వ్యాపారిని ‘నిజమైన హీరో’గా కొనియాడారు. చిన్న మొత్తాలకే మోసాలు జరిగే రోజుల్లో, కష్టపడి పనిచేసే ఒక సామాన్యుడు చూపిన ఈ గొప్ప మనసు అందరి హృదయాలను గెలుచుకుంది.
వైరల్ పోస్ట్ ఇక్కడ చూడండి..
Accidentally paid ₹1515 instead of ₹15 at a fruit shop.
Yesterday evening, while talking with my friends, I bought 3 bananas worth ₹15.
I was distracted in conversation, entered the amount without properly checking the screen, typed the UPI pin, took the fruits, and left.… pic.twitter.com/ioJi9DG5iZ
— SUPERBRO (@Rushu_Tushu) May 6, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…