అమ్మో..! మళ్లీ విరుచుకుపడ్డ ‘మ్యానిటర్‌’.. పులి దాడిలో ప్రాణాలు కోల్పోయిన పశువుల కాపరి!

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మోహర్లీ అటవీ ప్రాంతంలో పులి దాడి కలకలం రేపింది. జునోనా గ్రామానికి చెందిన 25 ఏళ్ల పశువుల కాపరి విజయ్ మృతి చెందారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పులి సంచారాన్ని గుర్తించేందుకు అటవీశాఖ కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేసి, ప్రజలు అటవీ ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది. భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.

అమ్మో..! మళ్లీ విరుచుకుపడ్డ మ్యానిటర్‌.. పులి దాడిలో ప్రాణాలు కోల్పోయిన పశువుల కాపరి!
Maharashtra Tiger Attack

Updated on: Aug 30, 2026 | 12:16 PM

మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లాలో పులి దాడి కలకలం రేపింది. మోహర్లీ అటవీ ప్రాంతంలోని 154 కంటోన్మెంట్‌ పరిధిలో పులి విరుచుకుపడింది. జునోనా గ్రామానికి చెందిన విజయ్‌ మధుకర్‌ మేశ్రామ్‌ (25)పై పులి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్‌ పశువులను మేపేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లారు. అదే సమయంలో పొదల్లో మాటువేసి ఉన్న పులి ఒక్కసారిగా విజయ్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. పులి దాడిలో తీవ్రంగా గాయపడిన విజయ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గురించి సమాచారం అందడంతో అటవీశాఖ అధికారులు, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

మరోవైపు పులి సంచారాన్ని గుర్తించేందుకు అటవీశాఖ అప్రమత్తమైంది. పులి కదలికలను పర్యవేక్షించేందుకు కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశారు. పులి ఏ ప్రాంతంలో సంచరిస్తోంది? అదే పులి గతంలోనూ గ్రామ పరిసరాల్లో కనిపించిందా? అనే కోణాల్లో అధికారులు నిఘా కొనసాగిస్తున్నారు.

ఇటీవల అటవీ ప్రాంతాలకు సమీపంగా పులుల సంచారం పెరగడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పశువుల కాపరులు, రైతులు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. కాగా, పులి కదలికలు పూర్తిగా గుర్తించే వరకు ప్రజలు ఒంటరిగా అటవీ ప్రాంతాల వైపు వెళ్లవద్దని, అధికారులు సూచించే జాగ్రత్తలు పాటించాలని అటవీశాఖ కోరుతోంది. తాజా ఘటన నేపథ్యంలో జునోనా, పరిసర గ్రామాల్లో భద్రతా చర్యలను మరింత పెంచే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us