
మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) పార్టీకి చెందిన ఆరుగురు లోక్‌సభ సభ్యులు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ పరిణామం నిజమైతే, 2022లో జరిగిన పార్టీ చీలిక తర్వాత ఉద్ధవ్ థాకరేకు ఇది మరో పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది.
పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్న ఎంపీలుగా సంజయ్ జాదవ్, సంజయ్ దేశ్‌ముఖ్, నగేష్ పాటిల్ అస్తికర్, ఓంరాజే నింబాల్కర్, భౌసాహెబ్ వాక్‌చౌరే, సంజయ్ దిన పాటిల్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరు షిండే వర్గంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో శివసేన (యూబీటీ) కీలక నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తీవ్రంగా స్పందించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీని వీడాలనుకునే ఎంపీలు ముందుగా తమ పదవులకు రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరాలని సవాల్ విసిరారు. “ఈ ఎంపీల గెలుపు వెనుక ఉద్ధవ్ థాకరే నాయకత్వం, శివసేన కార్యకర్తల కృషి ఉంది. పార్టీని వీడాలనుకుంటే ముందుగా రాజీనామా చేసి వెళ్లాలి” అని రౌత్ స్పష్టం చేశారు.
అదే సమయంలో 2022లో జరిగినట్లే మరోసారి శివసేనలో చీలిక సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. అయితే మహారాష్ట్ర ప్రజలు, శివసేన కార్యకర్తలు అలాంటి ప్రయత్నాలను సహించబోరని హెచ్చరించారు. పార్టీ ఎంపీలను భారీ మొత్తాల డబ్బుతో ప్రలోభపెడుతున్నారని కూడా సంజయ్ రౌత్ ఆరోపించారు. కొంతమంది ఎంపీలను రూ.15 కోట్ల వరకు ఆఫర్ చేసి పార్టీ మార్పుకు ప్రోత్సహిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
రౌత్ నిర్వహించిన మీడియా సమావేశానికి శివసేన (యూబీటీ)కి చెందిన తొమ్మిది మంది లోక్‌సభ సభ్యుల్లో కేవలం అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజభౌ వాజే మాత్రమే హాజరుకావడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మిగిలిన ఎంపీల గైర్హాజరీ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ఇదిలా ఉంటే, తిరుగుబాటు వార్తలపై శివసేన (యూబీటీ) వద్ద ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని రౌత్ పేర్కొన్నారు. అయితే పార్టీని బలహీనపరిచే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ పరిణామాలు మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..