
మధ్యప్రదేశ్‌లో అత్యంత హృదయ విదారకమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక కన్నతల్లే తన ముగ్గురు అమాయక కుమార్తెలకు దగ్గు మందు అని చెప్పి పురుగుల మందు ఇచ్చింది, ఆ తర్వాత తను కూడా అదే విషాన్ని మింగింది. గంటల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడం అందరిని కలచివేసింది. షాహ్‌దోల్ జిల్లా, బ్యావారి ప్రాంతంలోని హిర్వా గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం, 32 ఏళ్ల అనితా సింగ్ తన ముగ్గురు కుమార్తెలు రితిక (7), కృష్ణకుమారి (4), అర్పిత (2)లతో కలిసి ఆ గ్రామంలో నివసిస్తోంది. ఆమె భర్త ట్రక్ డ్రైవర్ కావడంతో, పని నిమిత్తం హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో తల్లి, ముగ్గురు కుమార్తెలు మాత్రమే ఉన్నారు.
పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం, అనిత తీవ్రమైన మానసిక ఒత్తిడి, కుంగుబాటుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. విషం తాగే ముందు ఆమె ఇంట్లోని బట్టలు, ముఖ్యమైన పత్రాలు, కుటుంబ ఫోటోలు, చివరికి ఇంట్లో ఉన్న ధాన్యానికి కూడా నిప్పంటించింది. ఆ తర్వాత కూతుళ్లకు దగ్గు మందని నమ్మించి పురుగుల మందు ఇచ్చి, తను కూడా తాగేసింది.
ఈ విషాద సంఘటనలో అత్యంత కలచివేసే అంశం ఏడేళ్ల రితికా అర్తనాదాలు. ఆమె శరీరంలోకి ప్రవేశించిన పురుగుమందు ప్రభావం తక్కువగా ఉండటంతో కొంతసేపు స్పృహలోనే ఉంది. ఇంట్లో తన తల్లి, ఇద్దరు చెల్లెళ్ల పరిస్థితి విషమించడం మొదలవ్వగానే, ఆ చిన్నారి తడబడుతూ ఇంటి నుంచి బయటకు వచ్చి ఇరుగుపొరుగు వారిని పిలిచింది. తన తల్లి మందు అని చెప్పి తమకు ఏదో తాపించిందని ఏడుస్తూ చెప్పింది.
పొరుగువారు వెంటనే ఆ నలుగురినీ బ్యావడి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. అనితతో పాటు ఇద్దరు చిన్న కుమార్తెలు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. రితికను కాపాడటానికి వైద్యులు ప్రయత్నించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె కూడా కన్నుమూసింది. అయితే మరణానికి ముందు ఆ చిన్నారి పోలీసులకు అందించిన సమాచారమే ఈ ఘటనలో అత్యంత కీలకమైన ఆధారంగా మారింది.
అనిత తన అత్తమామల నుండి విడిగా నివసించేది. భర్త ఖర్చుల కోసం క్రమం తప్పకుండా డబ్బు పంపేవాడు. ఆమె కూడా కూలీ పనులకు వెళ్లేది. ఆర్థిక పరిస్థితి అంత బలంగా లేనప్పటికీ, ఈ సామూహిక ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణం ఏదీ ఇంకా వెలుగులోకి రాలేదు. పోలీసులు పోస్ట్‌మార్టం పరీక్షలు నిర్వహించి, కేసు నమోదు చేసుకుని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..