ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణం అయిపోయినా.. ఎక్కువ శాతం పెద్దలు కూడా పిల్లల ఇష్టానికి గౌరవం ఇస్తున్న ఈ కాలంలో కూడా కొంతమంది ప్రేమ వివాహాలను పెద్ద తప్పులాగా చూస్తున్నారు. ఏదో చేయకూడని ఘోరాలు చేసినట్లుగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ ప్రేమ జంట విషయంలో గ్రామస్థులు ప్రవర్తించిన తీరు అందుకు ఎగ్జాంపుల్. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఓ యువ జంటను వారిని నాగలికి ఎద్దుల్లాగా కట్టి.. కర్రలతో కొడుతూ పొలం దున్నించి చితక బాదారు. ఆపై పాపపరిహారం అంటూ గుడిలోనూ చిత్రహింసలకు గురి చేశారు.
ఒడిశా – రాయగడ జిల్లాలోని కంజమజ్జిరా గ్రామంలో ఓ యువకుడు, యువతి చాలాకాలంగా ప్రేమించుకొని.. పెద్దలను ఒప్పించి ఇటీవలే వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహానికి కొందరు ఊరి పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామ ఆచారం ప్రకారం ఈ తరహా వివాహం అపచారమని చెబుతూ పెద్దలు ఈ శిక్షను విధించారు. తొలుత వీళ్లతో పొలం దున్నిస్తూ హింసించి అనంతరం గుడికి తీసుకెళ్లి పాపపరిహారం పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి