Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై బీఎస్పీ క్లారిటీ.. మాయావతి కీలక ప్రకటన..

|

Jan 15, 2024 | 12:00 PM

2024 General Elections: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. మరీ ముఖ్యంగా అధికార బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు విపక్ష కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష పార్టీల పొత్తులకు సంబంధించి జాతీయ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.

Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై బీఎస్పీ క్లారిటీ.. మాయావతి కీలక ప్రకటన..
BSP Chief Mayawati (File Photo)
Follow us on

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. మరీ ముఖ్యంగా అధికార బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు విపక్ష కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష పార్టీల పొత్తులకు సంబంధించి జాతీయ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో బహుజన్ సమాజ్‌వాది పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి సార్వత్రిక ఎన్నికల్లో పొత్తుల అంశంపై పూర్తి స్పష్టత ఇచ్చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీఎస్పీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆమె సోమవారం ప్రకటించారు. తమ పార్టీ ఇటు అధికార బీజేపీ.. అటు విపక్ష కూటమిలో చేరబోదని ఆమె తేల్చి చెప్పారు. గతంలోనూ లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మాయావతి ప్రకటించగా.. ఇప్పుడు మరోసారి తమ గత వైఖరిలో మార్పులేదని ఆమె పునరుద్ఘాటించారు.

దారిద్ర రేఖకు దిగువున ఉన్న వారికి ఉపాధి అవకాశాలు కల్పించి.. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా కేంద్రం, యూపీలో అధికారంలోని బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మాయావతి ఆరోపించారు. పేదలకు ఉచిత రేషన్ ఇస్తూ వారిని బానిసలుగా మార్చుతోందని ధ్వజమెత్తారు. గతంలో యూపీలో అధికారంలో ఉన్న తమ పార్టీ పేద వర్గాలకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించిందని చెప్పారు.

పొత్తులపై మాయావతి కీలక ప్రకటన..

కాగా ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై కూడా ఆమె తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. ఊసరవెల్లిలా అఖిలేష్ యాదవ్ రంగులు మార్చుతున్నారంటూ ఆమె ధ్వజమెత్తారు. కాంగ్రెస్, ఎస్పీలు బడా వ్యాపారవేత్తల పార్టీగా ఆరోపించారు. బాబా సాహేబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి లోబడి దేశంలో పనిచేస్తున్న ఏకైక పార్టీ బీఎస్పీ మాత్రమే అన్నారు. బడా పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ అనుకూలంగా వ్యవహరిస్తోందని.. ఓ రకంగా బీజేపీకి కాంగ్రెస్ సహకరిస్తోందని ఆరోపించారు.

తన రాజకీయ వారసుడికి ఆకాష్ ఆనంద్ పేరును గత నెల ప్రకటించడంతో తాను రాజకీయాల నుంచి త్వరలో వైదొలగుతున్నట్లు కొందరు పుకార్లు సృష్టించారన్నారు. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదన్నారు. పార్టీ బలోపేతానికి తాను పనిచేస్తూనే ఉంటానని చెప్పారు.

రాజకీయాలను వీడేది లేదన్న మాయావతి..

బీఎస్పీ అధినేత్రి మాయావతి బీజేపీకి ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారంటూ గత కొన్నేళ్లుగా విపక్ష కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీలు ఆరోపిస్తున్నాయి. బీజేపీకి బీఎస్పీ బీ టీమ్‌లా మారిందని.. ప్రజా వ్యతిరేక ఓటును చీల్చి కమలం పార్టీకి ఎన్నికల్లో లబ్ధి చేకూరుస్తోందని ఆ పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరి పోరుకు బీఎస్పీ నిర్ణయం తీసుకోవడం లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కలిసొచ్చే అంశం. దీంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్-ఎస్పీ కూటమిగా చేరి ఎన్నికలను ఎదుర్కొనే అవకాశముంది.