
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పొలంలో పని చేసుకుంటున్న ఓ వృద్ధురాలపై చిరుతపులి దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడంతో పాటు ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించింది. వివరాల ప్రకారం.. పాల్ఘర్ జిల్లాలోని విక్రమ్గడ్ తాలూకా సర్షి గ్రామానికి చెందిన తులసి రామా సవార్ (65) అనే వృద్ధురాలు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. రోజూ మాదిరిగానే.. ఆమె పొలం పనులకు వెళ్లారు.. దహను అటవీ డివిజన్ పరిధిలోని మాటేగావ్ గ్రామంలో పని చేస్తుండగా.. ఆదివారం సాయంత్రం ఆమెపై చిరుత అకస్మాత్తుగా దాడి చేసింది. మెడపై తీవ్రంగా గాయపరచడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.
పెద్దపెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి పరుగులు తీశారు. జనసంచారం పెరగడంతో చిరుత సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. అనంతరం చీకటి పడటంతో ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
సమాచారం అందుకున్న వంగావ్ అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ తుషార్ పచ్పుతే సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిత్యం జన సంచారం ఉండే ప్రాంతంలో చిరుత సంచరించి ప్రాణాలు తీయడంపై స్థానిక గ్రామస్థులు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఆ ప్రాంతంలో కెమెరా ట్రాప్లను, బోనులను (Cages) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చిరుతను వెంటనే బంధించకపోతే జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తామని గ్రామస్థులు హెచ్చరించారు.
అంతకుముందు, అక్టోబర్ 9న, పాల్ఘర్ మున్సిపల్ కౌన్సిల్ ప్రాంత శివార్లలోని భోగోలే పాడ (నవాలి) వద్ద చిరుత దాడిలో 52 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఇది రెండో ఘటన అని స్థానికులు తెలిపారు.
ఆగస్టు 1, 2026 నుండి పాల్ఘర్ అంతటా పలుమార్లు చిరుతపులులు కనిపించాయని.. అటవీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని పలువురు పేర్కొంటున్నారు.