
చెన్నై, జూన్ 1: పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి ఓ లేడీ డాక్టర్ అడ్డగోలుగా అవినీతికి పాల్పడింది. కేవలం రూ.25 ఆకు కూర కట్టను రూ.80 చొప్పున కొన్నట్లు రికార్డుల్లో పేర్కొంది. అనుమానం వచ్చిన అధికారులు ఆరా తీయగా అసలు బండారం బయటపడింది. ఇలా ఏకంగా 30 ఏళ్లకుపైగానే గుట్టుచప్పుడు కాకుండా సొమ్ము పోగుచేసింది. అయితే ఆమె అవినీతి భాగోతం పదవీ విరమణ రోజు బట్టబయలవడం విశేషం. అంతే రంగంలోకి దిగిన సర్కార్ సదరు ప్రభుత్వ వైద్యురాలిని రిటైర్‌మెంట్ రోజే సస్పెండ్ చేసింది. రోగులకు అందించే ఆకు కూరల నుంచి విలువైన వైద్యం వరకు దొరికిన కాడికి నొక్కి పేదల జీవితాలతో ఆటలాడిన సదరు ప్రభుత్వ వైద్యురాలు అప్రతిష్టపాలైంది. ఈ సంఘటన తమిళనాడులోని తెన్కాశి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే..
తమిళనాడులోని తెన్కాశి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ శ్రీపద్మావతి విధులు నిర్వహణ కాలంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. కొన్ని నెలల క్రితమే ఆమె తెన్కాశి ఆసుపత్రి నుంచి తూత్తుకుడి ప్రభుత్వాసుపత్రికి పరిపాలనాధికారిగా బదిలీపై వచ్చారు. అయితే జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్నప్పుడు రోగులకు ఆహారం అందించేందుకు అవసరమైన సరుకులకు అధిక ధరలు వేసింది. ఆకుకూరల కొనుగోలులో అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు అధికారులకు అందాయి. దీనిపై ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపట్టగా శ్రీపద్మావతి అవినీతి బండారం వెలుగులోకి వచ్చాయి. రూ.25 విలువ చేసే ఒక్కో ఆకుకూర కట్టను రూ.80 చొప్పున కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో చూపించినట్లు విచారణలో తేలింది.
మే 31న ఆమె పదవీ విరమణ చేయాల్సి ఉండగా గతంలో పనిచేసిన తెన్కాశి జిల్లా ప్రభుత్వాస్పత్రి నుంచి ఎలాంటి ఆరోపణలు లేనట్లు ధ్రువీకరించే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ సమర్పించాలని తూత్తుకుడి ఆసుపత్రి వైద్యాధికారులు ఆమెను కోరారు. అయితే డాక్టర్ శ్రీపద్మావతి మాత్రం అధికారులకు నకిలీ ధ్రువపత్రాన్ని అందజేసింది. ఆ సర్టిఫికెట్‌పై అనుమానం వచ్చిన తూత్తుకుడి వైద్యాధికారులు, తెన్కాశి ఆసుపత్రిలో క్షుణ్ణంగా విచారణ జరిపారు. దీంతో తూత్తుకుడి అధికారులు అనుమానంతో తెన్కాశి ఆస్పత్రిలో విచారణ జరపగా అది నిజంగానే నకిలీదని తేలింది. వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖకు సిఫార్సు చేశారు. ఆరోగ్య శాఖ శ్రీపద్మావతిని సస్పెండ్ చేస్తూ శనివారం (మే 31) ఆదేశాలు జారీచేసింది. సరిగ్గా పదవీ విరమణ రోజే ఇలా సస్పెన్షన్‌కు గురికావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.