పిల్లలు ఎగిరిగంతేసే వార్త.. సోమవారం స్కూల్స్, కాలేజీలకు సెలవు

సోమవారం కూడా సెలవు అంటే ఆశ్చర్యంగా ఉందా? కానీ, ఇది నిజం. ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కూడా అన్నీ స్కూల్స్ కాలేజీలకు సెలవు ప్రకటించింది. పైగా సెలవు ప్రకటించింది ఎందుకో తెలుసా? పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

పిల్లలు ఎగిరిగంతేసే వార్త.. సోమవారం స్కూల్స్, కాలేజీలకు సెలవు
Holiday In Kerala

Updated on: Jul 19, 2026 | 1:59 PM

ఆదివారం స్కూల్స్, కాలేజీలకు సెలవు అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, సోమవారం కూడా సెలవు అంటే ఆశ్చర్యంగా ఉందా? కానీ, ఇది నిజం. ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కూడా అన్నీ స్కూల్స్ కాలేజీలకు సెలవు ప్రకటించింది. పైగా సెలవు ప్రకటించింది ఎందుకో తెలుసా.. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ ఉందని. షాక్ అవుతున్నారా? ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెల్లవారుజామున ముగియనున్న ఫైనల్ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించింది.

ఈ మేరకు ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ ఆదేశాలు జారీ చేశారు. వృత్తి విద్యా కళాశాలలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు సహా అన్ని విద్యాసంస్థలు ఈ సెలవు పరిధిలోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రభుత్వ ఉత్తర్వు త్వరలో విడుదల కానుంది. అయితే ఇప్పటికే షెడ్యూల్ చేసిన పరీక్షలకు మాత్రం ఈ సెలవు వర్తించదు. ముందుగా నిర్ణయించిన పరీక్షలు యథావిధిగా నిర్వహించబడతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నిర్ణయించిన సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ అర్ధరాత్రి తర్వాత ముగియనున్న నేపథ్యంలో విద్యార్థులు ఉదయం పాఠశాలలకు హాజరుకావడం కష్టమవుతుందని ప్రతిపక్షాలు, తల్లిదండ్రులు, క్రీడాభిమానులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. మాజీ విద్యాశాఖ మంత్రి వి. శివన్‌కుట్టి కూడా గతంలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించే ఈ మ్యాచ్‌ను విద్యార్థులు కూడా ఆస్వాదించే అవకాశం కల్పించాలని అభిప్రాయపడ్డారు. కేరళలో ఫుట్‌బాల్‌కు ఉన్న విశేష ఆదరణ అందరికీ తెలిసిందే. ప్రపంచ కప్ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా అర్జెంటీనా, బ్రెజిల్ వంటి జట్లకు కేరళలో భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ ఫైనల్‌ను వీక్షించేందుకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

2026 ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, బలమైన స్పెయిన్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచ ఛాంపియన్‌గా మరోసారి నిలవాలని అర్జెంటీనా ప్రయత్నిస్తుండగా, మరోవైపు ట్రోఫీని తిరిగి సొంతం చేసుకోవాలని స్పెయిన్ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఈ ఫైనల్ ఫుట్‌బాల్ అభిమానులకు ఉత్కంఠభరితమైన పోరును అందించనుంది.

Follow Us