
సరిహద్దులో పాకిస్తాన్ కుట్రలు కొనసాగుతున్నాయి. LOC దగ్గర పాకిస్తాన్ డ్రోన్ల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. సరిహద్దు గ్రామాల్లో గత కొద్దిరోజులుగా పాకిస్తాన్ డ్రోన్లు ఆయుధాలతో పాటు డ్రగ్స్‌ను జారవిడుస్తున్నాయి. ఆర్మీ అధికారులు వెంటనే యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేసి వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మూడోసారి ఆర్మీ డ్రోన్లు కనిపించడం కలకలం రేపింది. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలోని పూంచ్‌లోని దేగ్వార్ ప్రాంతంలో కొన్ని అనుమానిత పాకిస్తాన్ డ్రోన్‌లను గుర్తించిన భారత సైన్యం గురువారం కాల్పులు జరిపింది.
ఈ వారంలో పశ్చిమ సరిహద్దులో భద్రతా దళాలు డ్రోన్లను అడ్డుకోవడం ఇది మూడోసారి. జనవరి 11 నుండి 15 వరకు ఎల్‌ఓసీ సమీపంలో కనీసం 15 డ్రోన్లు కనిపించాయని నివేదికలు పేర్కొంటున్నాయి. పూంచ్ జిల్లాలోని దిగ్వార్ ప్రాంతంలో, సాంబాలోని రామ్‌గఢ్ ప్రాంతంలోని ఇండో-పాక్ అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్తానీ డ్రోన్లు కనిపించాయి. పూంచ్‌లో కొన్ని పాకిస్తానీ డ్రోన్లు కనిపించిన తర్వాత, ఎలాంటి పరిస్థితినైనా నివారించడానికి భద్రతా దళాలను వెంటనే హై అలర్ట్‌లో ఉంచారు. జనవరి 11, 13 తేదీలలో సాంబా, మెంధార్ ప్రాంతాలలోని రాజౌరిలో డ్రోన్ల కదలిక కనిపించింది.
ఈ రోజు(గురువారం) జరిగిన సంఘటనను పరిగణనలోకి తీసుకుంటే, ఎల్‌ఓసీ వెంబడి కనీసం 15 డ్రోన్‌లను దళాలు గుర్తించాయి. భారత గణతంత్ర దినోత్సవం దగ్గర పడుతున్న కొద్దీ మానవరహిత చొరబాట్ల తీవ్రత పెరిగింది. ఇంతలో పశ్చిమ సరిహద్దు మీదుగా ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను తిప్పికొట్టడానికి భద్రతా దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి