ఈషా ఔట్‌రీచ్‌ మద్దతుతో అన్నదాతల అద్భుతం.. .400 కోట్ల వ్యాపారంతో జాతీయ అవార్డులు..

వ్యవసాయం దండగ కాదు.. పక్కా ప్లానింగ్, ఐక్యత ఉంటే తిరుగులేని లాభాల పండగేనని నిరూపిస్తున్నారు ఆ రైతులు. దళారుల చేతుల్లో మోసపోకుండా, తామే వ్యాపారవేత్తలుగా మారి ఏకంగా రూ.400 కోట్లకు పైగా టర్నోవర్ సాధించడమే కాకుండా జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డులను కొల్లగొట్టారు. సద్గురు ఈషా ఔట్‌రీచ్ మద్దతుతో నడుస్తున్న ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ సాధించిన ఈ అరుదైన విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్నదాతలకు ఆదర్శంగా నిలుస్తోంది.

ఈషా ఔట్‌రీచ్‌ మద్దతుతో అన్నదాతల అద్భుతం.. .400 కోట్ల వ్యాపారంతో జాతీయ అవార్డులు..
Isha Outreach Supported Fpos Win National Honours

Updated on: Oct 24, 2026 | 6:08 PM

దేశ రాజధాని న్యూఢిల్లీలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన ఎఫ్‌పీవో ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమంలో సద్గురుకు చెందిన ఈషా ఔట్‌రీచ్ మద్దతుతో నడుస్తున్న మూడు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఘన పురస్కారాలు అందుకున్నాయి. దేశవ్యాప్తంగా వేలాది ఎఫ్‌పీవోల నుంచి వచ్చిన దరఖాస్తులను మూడు దశల్లో పరిశీలించిన నిపుణుల కమిటీ.. మార్కెట్ లింకేజీ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, వ్యాపార సామర్థ్యం ఆధారంగా ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈషా మద్దతు గల రైతు సంస్థలు వరుసగా నాలుగో ఏడాది ఈ జాతీయ అవార్డులను దక్కించుకోవడం విశేషం.

అవార్డులు గెలుచుకున్న సంస్థలు ఇవే..

తెంచెరిమలై ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ : రైతుల పంటలకు విస్తృతమైన మార్కెట్ అవకాశాలు కల్పించినందుకు గానూ మార్కెట్ లింకేజ్ కేటగిరీలో ఈ సంస్థ అవార్డు దక్కించుకుంది.

పొన్నడ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్: వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ, పర్యావరణ అనుకూల స్థిరమైన పద్ధతులను అవలంబించినందుకు టెక్నాలజీ – సస్టైనబిలిటీ కేటగిరీలో అవార్డును గెలుచుకుంది.

సెన్నియాండవర్ ఎఫ్‌పీవో : మార్కెట్ విస్తరణలో చూపిన ప్రతిభకు గానూ మార్కెట్ లింకేజ్ కేటగిరీలో ప్రత్యేక గుర్తింపు పురస్కారాన్ని అందుకుంది.

కొబ్బరి రైతులకు పెరిగిన లాభాలు..

ఈ విజయంపై సెన్నియాండవర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ప్రతినిధి సెల్వరాజ్ స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. తమ సంస్థలో 750 మంది రైతు సభ్యులు ఉన్నారని, సుమారు 240 మంది రైతుల నుంచి తాము నేరుగా కొబ్బరి కాయలను సేకరిస్తున్నామని తెలిపారు. ‘‘బయట మార్కెట్ వ్యాపారుల కంటే మా సంస్థ రైతులకు కొబ్బరి కాయకు లేదా కిలోకు రూ.3 నుంచి రూ.4 అదనంగా చెల్లిస్తోంది. ఇది చిన్న, సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచడంలో ఎంతో ఉపయోగపడుతోంది. ఈషా సహకారంతో ఇతర రాష్ట్రాలు, అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఉత్పత్తులను విస్తరించేందుకు అడుగులు వేస్తున్నాం” అని ఆయన వెల్లడించారు.

సామూహిక వ్యవసాయంతో అన్నదాతల సాధికారత:

ఈషా ఔట్‌రీచ్‌కు చెందిన సేవ్ సాయిల్ ఫార్మర్స్ మూవ్‌మెంట్ ద్వారా చిన్న, సన్నకారు రైతులను ఏకం చేసి ఎఫ్‌పీవోలుగా తీర్చిదిద్దుతున్నారు. రైతులకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక, మార్కెటింగ్ మద్దతు అందిస్తూ వారిని వ్యాపారవేత్తలుగా మారుస్తున్నారు. రైతులు తమ ఉత్పత్తులకు మంచి ధర పొందేలా చేయడమే ఈ చొరవ ముఖ్య ఉద్దేశం. 2013లో ప్రారంభమైన వెల్లియంగిరి ఉళవన్ ఎఫ్‌పీవోతో మొదలైన ఈ ప్రస్థానం.. ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 25 ఎఫ్‌పీవోలకు విస్తరించింది.

రూ. 400 కోట్లకు పైగా టర్నోవర్.. 17 వేల మంది రైతులు:

ఈషా ఔట్‌రీచ్ నెట్‌వర్క్ పరిధిలోని గణాంకాలు గ్రామీణ వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను స్పష్టం చేస్తున్నాయి. 25 ఎఫ్‌పీవోల పరిధిలో 17,000 మందికి పైగా రైతు సభ్యులు ఉన్నారు. ఇందులో 60 శాతానికి పైగా చిన్న, సన్నకారు రైతులే కాగా, 15 శాతం మంది మహిళా రైతులు భాగస్వాములుగా ఉన్నారు. 8 జిల్లాల్లోని దాదాపు 580 గ్రామాల్లో 54,000 ఎకరాలకు పైగా భూమిలో ఈ రైతులు సాగు చేస్తున్నారు. కొబ్బరి, కాఫీ, అరటి, చిరుధాన్యాలు సహా 15 రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఈ 25 ఎఫ్‌పీవోలు కలిసి ఇప్పటివరకు రూ.400 కోట్లకు పైగా ఉమ్మడి టర్నోవర్‌ను నమోదు చేయడం విశేషం.

Loading...
Unable to load recommendations.
Follow Us