Tiger Day 2024: రూపంలో రాజసం.. వొళ్లంతా పౌరుషం.. పులి రాజాకు ఏమైంది?

|

Jul 29, 2024 | 11:09 AM

కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత ఐదేళ్లలో భారతదేశంలో మొత్తం 628 పులులు మరణించాయి. ఇందులో చాలా వరకూ సహజ మరణాలు కాగా.. కొన్ని అసహజ మరణాలుగా పరిగణిస్తున్నారు. అసహజ కారణాలతో సంభవించిన మరణాల్లో ప్రమాదాలు, ఘర్షణలు కారణం సంభవించగా.. వేట కారణంగా సంభవించే పులల మరణాలను ఇతర కేటగిరీ కింద పరిగణిస్తున్నారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) గణాంకాల మేరకు భారతదేశంలో మొత్తం పులుల సంఖ్య 3,682 గా ఉంది.

Tiger Day 2024: రూపంలో రాజసం.. వొళ్లంతా పౌరుషం.. పులి రాజాకు ఏమైంది?
Tiger
Follow us on

నడకలో రాజసం.. వొళ్లంతా పౌరుషం.. పరుగులో మెరుపువేగం.. ఇవన్నీ పులి రాజాకే సొంతం. దాని రూపంలో గాంభీర్యం వర్ణణలకు అతీతం. అది ఒక్కసారి గాండ్రిస్తే అడవంతా దద్దరిల్లిపోవాల్సిందే.. ఏ జంతువైనా తోక ముడుచుకోవాల్సిందే. టన్నుల కొద్దీ ఠీవీని తనలో ఇనుమడించుకున్న పులి రాజా మనుగడ ప్రమాదపు అంచుల్లో ఉండటం జంతు ప్రియులు, పర్యావరణ ప్రేమికులతో పాటు ప్రభుత్వ యంత్రాంగాలను ఆందోళనకు గురిచేస్తోంది. పులి గాండ్రింపు సురక్షితం కావాలన్న ఆకాంక్ష నెరవేరాలంటే ఎన్నో సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎదుర్కావాల్సి ఉంది. జులై 29న అంతర్జాతీయ పులల దినోత్సవ సందర్భంగా పులుల సంరక్షణ సందేశం మరోసారి బలంగా వినిపిస్తోంది.

గొప్ప జీవవైవిధ్యం భారతదేశ సొంతం. ఓ వైపు భారత జనాభా వేగంగా పెరుగుతోంది. అదే సమయంలో ఓ సమస్య మరింత జఠిలంగా మారుతోంది. అదే మానవ – జంతు సంఘర్షణ. మానవ కార్యక్రమాలు విస్తరించడంతో వన్యప్రాణుల ఆవాసాలు క్రమేణా తగ్గిపోతున్నాయి. దీంతో మానవ జాతి, వన్యప్రాణుల మధ్య సంఘర్షణ రోజురోజుకూ ముదురుతోంది. మరీ ముఖ్యంగా ఏనుగులు, పులుల, చిరుతల దాడుల్లో మానవులు గాయపడటం లేదా మరణిస్తుండటం నిత్యం వార్తల్లో దర్శనమిస్తుండగా.. మరో వైపు ఆధునిక మానవుడి విపరీత చేష్టలతో వన్యప్రాణుల మనుగడను ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ రెండూ బాధ కలిగించే అంశాలే.. ఈ నేపథ్యంలో సహజ వారసత్వాన్ని సంరక్షించుకునేందుకు మానవ – జంతు సంఘర్షణను అర్థం చేసుకోవడం, ఈ రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని తగ్గించడం ప్రస్తుతం సవాలుగా మారింది.

మరీ ముఖ్యంగా మానవ జాతి – పులల మధ్య సంఘర్షణ ముదురుతోంది. దీంతో పులులు అంతరించిపోయే జంతువుగా ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు ఒక్క గాండ్రింపుతో అడవిని శాసించిన పులులు ఇప్పుడు మనుగడ కోసం మూగపోరాటం చేయాల్సిన దుస్థితి నెలకొంది. వందేళ్లకు ముందు ప్రపంచంలోని పలు దేశాల్లో లక్షకు పైగా పులులు ఉండేవి. ఒక్క భారత్‌లో మాత్రమే 40 వేలకు పైగా పులులు ఉండేవట. అయితే వాతావరణ మార్పులు, ఆధునిక మానవుడి విపరీత చేష్టల కారణంగా ప్రపంచంలో పులుల సంఖ్య దాదాపు 90 శాతానికి పైగా అంతరించిపోయింది. ఇది ప్రకృతి సమతుల్యతకు పెద్ద గొడ్డలిపెట్టుగా మారింది.  మిగిలిన 10 శాతాన్ని సంరక్షించుకోవడం, వృద్ధి చేసుకోవడం మనందరి భాద్యతగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పులుల్లో దాదాపు 75 శాతం భారత్‌లోనే ఉండటం విశేషం.

Tiger Population

ప్రస్తుతం భారత్‌తో పాటు భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఇండోనేషియా, థాయ్ లాండ్, చైనా, రష్యా తదితర దేశాల్లో మాత్రమే పులుల కదలికలు ఉన్నాయి. తాజా గణాంకాల మేరకు ప్రస్తుతం భారతదేశంలోని పులుల సంఖ్య 3,682గా ఉంది. మానవ-పులి సంఘర్షణతో తరచుగా రెండు వైపులా ప్రాణనష్టానికి దారితీస్తున్నాయి. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, బెంగాల్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది.

గత ఐదేళ్లలో 628 పులులు మృతి..

దేశంలో పులుల మరణాలు యేటికేడు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ గణాంకాల మేరకు.. గత ఐదేళ్లలో భారతదేశంలో మొత్తం 628 పులులు మరణించాయి. ఇందులో చాలా వరకూ సహజ మరణాలు కాగా.. కొన్ని అసహజ మరణాలుగా పరిగణిస్తున్నారు. అసహజ కారణాలతో.. అంటే ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు,  ఘర్షణలు కారణం సంభవించిన మరణాలు.  వేటగాళ్ల కారణంగా సంభవించే పులల మరణాలను ఇతర కేటగిరీ కింద పరిగణిస్తున్నారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) గణాంకాల మేరకు భారతదేశంలో మొత్తం పులుల సంఖ్య 3,682 గా ఉంది.

అయితే గత కొన్నేళ్లుగా దేశంలో పులుల మరణాలు పెరగడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. 2019లో 96; 2020లో 106; 2021లో 127; 2022లో 121; 2023లో 178 పులులు చనిపోయాయి. అంతకు ముందు అంటే 2018లో 101; 2017లో 117; 2016లో 121; 2015లో 82; 2014లో 78; 2013లో 68, 2012లో 88 పులుల మరణాలు నమోదయ్యాయని NTCA డేటా వెల్లడించింది. 2023లో పులుల మరణాల సంఖ్య గత 12 ఏళ్లలో అత్యధికంగా నమోదయ్యాయి. 2012 తర్వాత అత్యధిక స్థాయిలో పులలు మరణించినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించడం జంతు ప్రియులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

Tiger

దేశంలో వ్యాఘ్రాల మరణాలు ఇలా..

  • 2012  – 88
  • 2015  – 82
  • 2018  – 101
  • 2021  – 125
  • 2022- 121
  • 2023-178

2023లో పులుల మరణాలు అత్యధికంగా నమోదైనప్పటికీ.. 2018-2023 మధ్యకాలంలో పులల సంతతి గణనీయంగా పెరగడం కాస్త ఊరట కలిగించే అంశం. 2018లో దేశంలోని మొత్తం పులుల సంఖ్య 2,967 కాగా.. 2022కి ఇది 3,167కు చేరింది. 2023 నాటికి ఈ సంఖ్య 3,682కు పెరిగింది. దేశంలో పులుల పునరుత్పత్తి సామర్థ్యం పెరిగినట్లు తాజా గణాంకాలతో తేటతెల్లమవుతోంది. ఓ వైపు భారత్‌లో పులుల సంతతి పెరుగుతూ ఉన్నా.. అదే స్థాయిలో మరణాలు కూడా పెరగడం ఆందోళనకరమైన అంశమే!!

2010 నుంచి దేశంలో పులుల సంఖ్య పెరుగుతోందిలా..

  • 2010- 1,706
  • 2014- 2,226
  • 2018- 2,967
  • 2022 -3,167
  • 2023- 3,682

ప్రాజెక్ట్ టైగర్ ఊతం

దేశంలో పులుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపుతున్నాయి. పులుల సంరక్షణను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఏప్రిల్ 1, 1973న ‘ప్రాజెక్ట్ టైగర్‌’కు శ్రీకారం చుట్టింది. 1970నాటికి దేశంలో పులుల సంఖ్య 1440కి పడిపోవడంతో నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. గత 50 ఏళ్లుగా ఈ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతతో కేంద్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయి. పులుల సంరక్షణను ప్రోత్సహించడంతో పాటు ఆహార గొలుసులో పులులు అగ్రస్థానంలో ఉన్నందున వాటి సహజ ఆవాసాల సంరక్షణ ఈ ప్రాజెక్టు లక్ష్యంగా ఉంది. ఇందులో భాగంగా మొదట 18,278 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో తొమ్మిది టైగర్ రిజర్వ్‌లను ఏర్పాటు చేసింది. ఇప్పుడు భారతదేశంలో 78,735 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో దాదాపు 55 టైగర్ రిజర్వ్ లు ఉన్నాయి. దేశ మొత్తం భౌగోళిక ప్రాంతంలో దాదాపు 2.4 శాతం మాత్రమే పులులకు ఆవాసాలుగా ఉన్నాయి. దేశంలో పులుల సంఖ్య పెరుగుతున్నాయంటే ఆ క్రెడిట్ ప్రాజెక్ట్ టైగర్‌కే చెందుతుందంటే అతిసయోక్తి కాదు.  కాగా ప్రాజెక్ట్ టైగర్ వార్షిక నివేదిక – 2023 మేరకు దక్షిణాఫ్రికా, నమీబియా నుండి 20 పులులు దిగుమతి చేసుకోగా.. 2024 మార్చి వరకు వాటిలో ఆరు మరణించడం విచారకరమైన అంశం.

అంతరించిపోతున్న రాయల్ బెంగాల్ టైగర్లు..

భారత్‌లోని పులుల్లో రాయల్ బెంగాల్ టైగర్ల రాజసం, గాంభీర్యం ప్రత్యేకమైనది. రాయల్ బెంగాల్ టైగర్‌లు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లో విస్తరించిన సుందర్‌బన్‌ అడవుల్లో జీవిస్తాయి. ఇప్పటికే అంతరించే స్థాయికి చేరుకున్న ఈ పులులు వచ్చే 50 ఏళ్లలో కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన నెలకొంటోంది. దాదాపు 10వేల చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంలో ఉన్న మడ అడవులకు వాతావరణ మార్పులు పెను శాపంగా మారుతున్నాయి. ఫలితంగా సుందర్‌బన్‌ అడవులు 2070 నాటికి అదృశ్యం అవుతాయని.. బెంగాల్‌ పులులు, ఇతర జాతులు అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Tiger

మానవ-జంతు సంఘర్షణకు పరిష్కారం ఎలా..?

పట్టణీకరణతో పాటు వ్యవసాయ భూముల విస్తరణ, మారుమూల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలు వన్యప్రాణుల సహజ ఆవాసాలు, జంతు కారిడార్ల విచ్ఛిన్నానికి గణనీయంగా దోహదం చేస్తున్నాయి. ఫలితంగా వన్యప్రాణులు ఎక్కువగా మానవ ఆవాసాల్లోకి చొరబాటు చేస్తున్నాయి. సహజ వనరుల క్షీణత కారణంగా వన్యప్రాణులు.. జీవనోపాధి కోసం వ్యవసాయ క్షేత్రాలు, గ్రామాలలోకి ప్రవేశించేలా చేస్తోంది. ఇది మానవులు- వన్యప్రాణుల మధ్య సంఘర్షణను తీవ్రతరం చేస్తుంది.

ఈ నేపథ్యంలో వన్యప్రాణుల హక్కులు, ప్రకృతి సమతుల్యతపై రాజీ పడకుండా మానవ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముంది. రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని తగ్గించి సహ జీవనానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వాలు సమగ్ర వ్యూహాలు అమలు చేయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. కంచెలు, డ్రోన్లు, రేడియో కాలర్లు, గ్రామ పునరావాసం వంటి వ్యూహాలతో రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఈ సమస్య పరిష్కారం దిశగా ఇప్పటికే ప్రత్యేక చొరవ చూపుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వాలు నిర్దేశిత లక్ష్యాలను మరింత సమర్థవంతంగా చేరుకునేందుకు అవకాశముంది. వన్యప్రాణుల సంరక్షణకు చేపడుతున్న పలు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలను ఏకీకృతం చేయాల్సిన అవసరముంది. అడవి జంతువుల కదలికలను పర్యవేక్షించే వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా.. మానవ-జంతు సంఘర్షణను తగ్గించే అవకాశముంటుంది.

మానవుడు-పులి మధ్య  సంఘర్షణ తగ్గాలంటే..?

అడవి పులులు 12 నుంచి 14 ఏళ్లు జీవిస్తాయి. వృద్ధాప్యంలో పులులు దంతాలు రాలిపోవడం, బలహీనంగా మారడంతో స్వయంగా వేటాడి తమ ఆహారాన్ని సమకూర్చుకోవడం కష్టతరంగా మారుతుంది. దీంతో తమ ఆహారం కోసం అవి తమ ప్రాంతాన్ని వీడి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటాయి. సులభంగా ఆహారాన్ని సమకూర్చుకునే వ్యూహంతో అవి తాము నివాసమున్న అడవీ ప్రాంతాన్ని వీడి..ఇతర ప్రాంతాలకు వెళ్తాయి. మానవులతో సంఘర్షణ అప్పుడే మొదలువుతుంది.

తమ జీవనోపాధి కోసం మారుమూల గ్రామీణ ప్రాంతవాసులు తేనె, కలప వంటి వాటి కోసం దట్టమైన అడవుల్లోకి చొచ్చుకుని వెళ్తున్నారు. అలా అడవి లోపలి ప్రాంతాల్లో నిద్రిస్తున్న లేదా విశ్రాంతి తీసుకుంటున్న పులుల కంటపడుతారు. దీంతో తమ ప్రాంతానికి చొరబడినట్లు భావించి మనుషులపై అవి దాడి చేస్తాయి. అయితే ఇలాంటి సమయంలో పులులు మనుషులను చంపేస్తాయి తప్ప వారిని ఆహారంగా తీసుకోవు. వయో భారంతో బలహీనపడిన పులులు, ఇతర వన్యప్రాణుల దాడుల్లో తీవ్రంగా గాయపడిన పులులు సులభంగా ఆహారాన్ని సమకూర్చుకునేందుకు ఇతర ప్రాణులు, మనుషులపై దాడి చేసి ఆహారంగా తీసుకుంటాయి.

వృద్ధాప్య భారంతో వేటాడి ఆహారాన్ని సమకూర్చుకునే సమర్థ్యాన్ని కోల్పోయిన పులులను వీలైనంత త్వరగా గుర్తించి.. వాటిని అక్కడి నుంచి సంరక్షణ కేంద్రాలకు తరలించాల్సిన అవసరముందని పులుల సంరక్షణ నిపుణులు సూచిస్తున్నారు. సమస్యాత్మకమైన పులులు వాటి సంరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తాయని చెబుతున్నారు. అలాగే పులల ఆవాస ప్రాంతాల్లోని గ్రామాలను ఖాళీ చేయించి ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించడం ద్వారా మానవ-పులి సంఘర్షణ నివారణలో రెండో కీలకమైన అంశంగా చెబుతున్నారు. పులులపై గ్రామీణ ప్రాంతవాసులు ప్రతీకార దాడులకు పాల్పడకుండా తక్షణ పరిహారం చెల్లించడం, సహేతుకమైన పరిహారాన్ని చెల్లించడం చాలా అవసరం. ఇది బాధిత గ్రామస్థులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేందుకు, పులుల మనగడ పట్ల చొరవ చూపేందుకు దోహదపడుతుంది. అలాగే అడవుల విస్తీర్ణాన్ని పెంచుకోవాల్సిన అవసరముందని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.

Tiger

తెలంగాణలోకి వచ్చే ప్రయత్నంలో పులులు..

తెలంగాణలో పులులు లేవు. అప్పుడప్పుడు కనిపించినా.. అవి చిరుతలే. బెబ్బులి మాత్రం రాష్ట్రంలో ఇప్పటివరకు ఆవాసాన్ని ఏర్పర్చుకోలేదు. మహారాష్ట్ర నుంచి కొన్ని పులులు తెలంగాణలోకి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. అక్కడ అరణ్యాల్లో పులుల సంఖ్య పెరిగిపోవడంతో ఆదిలాబాద్‌ కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లోకి వచ్చేందుకు మార్గాన్ని వెతుక్కుంటున్నాయి. తెలంగాణలో పులుల కోసం అమ్రాబాద్, కవ్వాల్ అభయారణ్యాలు ఉన్నాయి. ఏపీలో శ్రీశైలం-నాగార్జునసాగర్ అభయారణ్యం దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లలో ఒకటిగా పేరుగాంచింది. ఈ అభయారణ్యంలో కనీసం 70-80 పులులు ఉండవచ్చని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు.

దేశ సహజ వారసత్వ సంరక్షకులుగా మనం జీవ వైవిధ్యాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ప్రకృతిలో భాగస్వామ్యమైన వన్యప్రాణులతో సామరస్యపూర్వక సంబంధాన్ని ఏర్పరచుకోవడం మన బాధ్యత. అప్పుడే జీవ వైవిధ్యంలో కీలకమైన వన్యప్రాణులూ మనుగడ సాధించగలవు.

లోకా సమస్తా సుఖినోభవంతు..
సర్వేజనా సుఖినో భవంతు..
సర్వేప్రాణ సుఖినో భవంతు..