
మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ సరిహద్దులో దారుణ ఘటన చోటుచేసుకుంది. దీపావళి పండుగ కోసం పుట్టింటికి వచ్చిన IndiGo ఎయిర్ హోస్టెస్ హత్యకు గురైంది. వైన్‌గంగా నది తీరంలో 35 ఏళ్ల వర్ష తుర్కర్‌ను గుర్తుతెలియని దుండగుడు పదునైన ఆయుధంతో దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..
35 ఏళ్ల వర్ష తుర్కర్ తన రెండున్నరేళ్ల కుమార్తెతో కలిసి దీపావళి పండుగను జరుపుకునేందుకు పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో తన స్నేహితుడు రితేష్ అగర్వాల్‌తో కలిసి బోండ్రానీ సమీపంలోని వైన్‌గంగా నది తీరానికి వెళ్లింది. అక్కడ ఆమెపై దారుణంగా దాడి జరిగింది. దుండగుడు పదునైన ఆయుధంతో వర్ష వీపుపై నాలుగుసార్లు పొడిచినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె అధిక రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
మరోవైపు, ఈ హత్య దోపిడీ యత్నంలో భాగంగా జరిగిందని రితేష్ అగర్వాల్ బాధితురాలి బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న రితేష్ అగర్వాల్‌తో పాటు వర్ష బావ అశ్విని అలియాస్ పప్పు పట్లేలను మహారాష్ట్రలోని దౌనివాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. హత్య వెనుక అసలు కారణం ఏమిటి? ఈ ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసుల విచారణ పూర్తయితేనే హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.