గాలిలో ల్యాండింగ్ గేర్ మొరాయింపు.. ఇండిగో విమానంలో హైటెన్షన్.. తప్పిన పెను ప్రమాదం..!
ఇండిగో విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం తీవ్ర కలకలం రేపింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ల్యాండింగ్ గేర్ లోపలికి వెళ్లకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో విమానాన్ని తిరిగి పూణే విమానాశ్రయానికి మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో విమానంలోని 192 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

పూణే: ఇండిగో విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం తీవ్ర కలకలం రేపింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ల్యాండింగ్ గేర్ లోపలికి వెళ్లకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో విమానాన్ని తిరిగి పూణే విమానాశ్రయానికి మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో విమానంలోని 192 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. పూణే నుంచి గౌహతి వెళ్లాల్సిన ఇండిగో విమానం (6E 0623) టేకాఫ్ అయిన తర్వాత ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ల్యాండింగ్ గేర్ లోపలికి వెళ్లకపోవడంతో విమాన సిబ్బంది వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. దీంతో విమానాన్ని తిరిగి పూణే విమానాశ్రయానికి తీసుకురావాలని నిర్ణయించారు.
ల్యాండింగ్‌కు ముందు విమానాశ్రయ రన్‌వేపై విమానాన్ని తక్కువ ఎత్తులో నడిపిస్తూ (Low Pass) ల్యాండింగ్ గేర్ పరిస్థితిని అధికారులు పరిశీలించారు. అనంతరం ఉదయం 9:04 గంటలకు విమానం సురక్షితంగా రన్‌వేపై ల్యాండ్ అయింది. ముందస్తు జాగ్రత్తగా మూడు ఫైర్ ఇంజిన్లు, రెండు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. సురక్షిత ల్యాండింగ్ అనంతరం విమానాన్ని బే నంబర్ 7కు తరలించారు. ఉదయం 9:10 గంటలకు అత్యవసర పరిస్థితిని ఉపసంహరించారు.
ఇక ప్రయాణికులను గౌహతికి చేర్చేందుకు బెంగళూరు నుంచి ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇండిగో తెలిపింది. సకాలంలో స్పందించిన విమాన సిబ్బంది, విమానాశ్రయ అధికారుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి అధికారులు విచారణ చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
