
భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ తన తొలి అంతరిక్ష యాత్రను విజయవంతంగా ప్రారంభించారు. రష్యాకు చెందిన సోయుజ్ ఎంఎస్-29 (Soyuz MS-29) అంతరిక్ష నౌకలో రష్యన్ వ్యోమగాములు ప్యోటర్ డుబ్రోవ్, అన్నా కికినాతో కలిసి కజకిస్థాన్‌లోని చారిత్రాత్మక బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుంచి ఆయన ప్రయాణమయ్యారు. వీరి టీం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) చేరుకుని సుమారు 8 నెలల పాటు శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ప్రదర్శనలు నిర్వహించనుంది. అనంతరం 2027లో భూమికి తిరిగి రానుంది. మంగళవారం రాత్రి 8:17 గంటలకు నాసా వ్యోమగామి అనిల్ మీనన్ ప్రయాణం ప్రారంభమైంది. వీరు ప్రయాణిస్తున్న సోయుజ్ ఎంఎస్-29 అంతరిక్ష నౌక మూడు గంటలకు పైగా ప్రయాణించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమవుతుంది.
ఈ యాత్రలో అనిల్ మీనన్ ‘మానవ శరీరం అంతరిక్ష వాతావరణానికి ఎలా అనుగుణంగా మారుతుంది’ అనే అంశంపై కీలక ప్రయోగాల్లో పాల్గొననున్నారు. సూక్ష్మ గురుత్వాకర్షణ (మైక్రోగ్రావిటీ) పరిస్థితుల్లో రక్తప్రసరణ, రక్తనాళాల నిర్మాణం, రక్తంలోని మార్పులను శాస్త్రవేత్తలు అధ్యయనం చేయనున్నారు. అలాగే అంతరిక్ష కేంద్రంలో అందుబాటులో ఉన్న తాగునీటితో ఇంట్రావీనస్ (IV) ద్రవాలను తయారు చేసే సాంకేతికతను పరీక్షించనున్నారు. భవిష్యత్తులో చంద్రుడు, అంగారక గ్రహాలపై దీర్ఘకాల అంతరిక్ష యాత్రలకు ఈ పరిశోధనలు ఎంతో ఉపయోగపడనున్నాయి. అలాగే ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR), AI ఆధారిత అల్ట్రాసౌండ్ విధానాలపై కూడా ఆయన పరిశోధనల్లో పాల్గొంటారు. భవిష్యత్ లోతైన అంతరిక్ష మిషన్లలో వ్యోమగాములకు వైద్య సహాయాన్ని మెరుగుపరచడంలో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి.
మినియాపోలిస్‌లో భారతీయ తండ్రి, ఉక్రెయిన్ తల్లికి జన్మించిన అనిల్ మీనన్ న్యూరోబయాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్, మెడిసిన్ విభాగాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. అత్యవసర వైద్య నిపుణుడిగా (Emergency Medicine Physician) సేవలందిస్తున్న ఆయన అమెరికా స్పేస్ ఫోర్స్‌లో కల్నల్‌గా కూడా ఉన్నారు. అమెరికా వైమానిక దళంలో పనిచేసిన సమయంలో ఆఫ్ఘానిస్తాన్‌లోని ‘ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడం’లో సేవలందించారు. అలాగే హిమాలయన్ రెస్క్యూ అసోసియేషన్‌తో కలిసి మౌంట్ ఎవరెస్ట్ పర్వతారోహకులకు వైద్యసేవలు అందించారు. పోలియో నిర్మూలన కార్యక్రమాలను అధ్యయనం చేసి ప్రోత్సహించేందుకు రోటరీ అంబాసడోరియల్ స్కాలర్‌గా భారత్‌లో ఒక సంవత్సరం గడిపారు.
2014లో నాసాలో ఫ్లైట్ సర్జన్‌గా చేరిన అనిల్ మీనన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పనిచేసే వ్యోమగాములకు వైద్య సహాయం అందించారు. 2018లో స్పేస్‌ఎక్స్‌లో చేరి సంస్థ వైద్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి మానవ అంతరిక్ష ప్రయాణాల సన్నాహకాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు చంద్రుడు, అంగారక గ్రహం, మరింత దూర అంతరిక్ష యాత్రల కోసం రూపొందిస్తున్న స్టార్‌షిప్ అభివృద్ధిలో కూడా భాగమయ్యారు. 2021 డిసెంబర్‌లో నాసా వ్యోమగామిగా ఎంపికైన ఆయన అనంతరం రెండేళ్ల కఠిన శిక్షణను పూర్తి చేశారు. అన్నట్టూ.. అనిల్ మీనన్ భార్య అన్నా విల్హెల్మ్ కూడా వ్యోమగామే. ఆమె 2024 సెప్టెంబర్‌లో స్పేస్‌ఎక్స్ నిర్వహించిన ప్రైవేట్ మానవ అంతరిక్ష యాత్రలో పాల్గొని దాదాపు ఐదు రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. భారత మూలాలు కలిగిన అనిల్ మీనన్ తొలి అంతరిక్ష యాత్ర ప్రపంచవ్యాప్తంగా భారతీయుల్లో గర్వకారణంగా నిలిచింది.