70 మంది నిరసనకారులకు ఆశ్రయం.. ఇండో-అమెరికన్ మానవతావాదం

అమెరికాలో సుమారు 17సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఇండో-అమెరికన్ బిజినెస్ మన్ రాహుల్ దూబే అక్కడ రియల్ 'హీరో' అయిపోయారు. తన ఇంట్లో ఆయన సుమారు..

70 మంది నిరసనకారులకు ఆశ్రయం.. ఇండో-అమెరికన్ మానవతావాదం

Edited By:

Updated on: Jun 04, 2020 | 1:35 PM

అమెరికాలో సుమారు 17సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఇండో-అమెరికన్ బిజినెస్ మన్ రాహుల్ దూబే అక్కడ రియల్ ‘హీరో’ అయిపోయారు. తన ఇంట్లో ఆయన సుమారు 70 మంది నిరసనకారులకు ఆశ్రయమిచ్చి…  వారికి ఆహారం కూడా సమకూర్చారు. తన ఇంటినే వారికి ‘శ్రీరామరక్ష’గా చేశారు. తన నివాసంలో ఏ ఖాళీ ప్రదేశమున్నా అక్కడ వారిని అడ్జస్ట్ చేశారు. చివరకు తన కొడుకు గదిని, బాత్ రూమ్ వద్ద గల ఖాళీ స్థలాన్ని సైతం వారికి కేటాయించేందుకు దూబే సందేహించలేదు. నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా ఆందోళన చేస్తున్న నిరసనకారులపై పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించి పెప్పర్ స్ప్రే కూడా చల్లగా అనేకమంది కళ్ళు మండుతూ… కొందరు గాయాలతో దూబే ఇంటిని శరణు జొచ్చారు.  కానీ వారికోసం ఆయన ఇంటి తలుపులు తెరిచి  ఉంచాడు.  ఎలాంటి సంకోచం  లేకుండా.. అందరినీ తన కుటుంబ సభ్యులుగా భావించాడు.

అల్వారెజ్ దూబే ట్రేడింగ్ కంపెనీ యజమాని అయిన దూబే.. మంచి మనసున్న మనిషి అంటూ ప్రధాన పత్రికల్లో పతాక శీర్షిక వార్తలు వచ్చాయి. నిజంగా ఆయన ఓ ‘హీరో’ అని ఈ వార్తల్లో అభివర్ణించారు. ఒక రోజంతా ఆందోళనకారులు ఈయన ఇంట్లోనే ఉన్నారు. పోలీసులు పూర్తిగా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయాక.. వారు కూడా దూబేకి కృతజ్ఞతలు తెలియజేస్తూ నిష్క్రమించారు.