
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నా, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా భారత్ మాత్రం జీడీపీలో దూసుకెళ్తోంది. అగ్రదేశాల జీడీపీ ఎలా ఉన్నా భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందని ప్రపంచ సంస్థలే చెబుతున్నాయి. ఇటీవలే జపాన్ ను అధిగమించి ప్రపంచంలోనే నాలుగవ ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరించింది. 2030 నాటికి జర్మనీని సైతం అధిగమించి మూడో అతిపెద్ద ఎకానమీ దేశంగా భారత్ నిలుస్తుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అన్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా 77వ ఫౌండేషన్ డే వేడుకల్లో ఆయన ప్రసంగించారు. గత 11 ఏళ్లలో మన దేశ జీడీపీ డబుల్ అయ్యిందని చెప్పారు. 2014లో దేశ జీడీపీ 2.1 ట్రిలియన్ డాలర్లుగా ఉంటే 2025లో అది 4.3ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. మోడీ చేపట్టిన సంస్కరణల వల్లే ఇది సాధ్యమైందన్నారు. పేదల అభ్యున్నతి కోసం మోడీ ఎన్నో పథకాలు తీసుకొచ్చినట్లు తెలిపారు.
మోడీ స్కీమ్ లతో 27 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని హర్దీప్ సింగ్ పూరీ అన్నారు. ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద 4 కోట్ల మందికి ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. అదేవిధంగా 15.4 కోట్ల మందికి నల్లా కనెక్షన్ల ద్వారా తాగు నీరు అందిస్తున్నామని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ స్కిమ్ తో 70కోట్ల మందికి రూ.5లక్షల బీమా అందిస్తున్నామన్నారు. ఇవన్నీ దేశాభివృద్ధికి మోడీ ప్రభుత్వ నిబద్ధతకు అద్దం పడుతున్నాయని చెప్పారు.
అంతేకాకుండా విదేశీ పెట్టుబడులను సాధించడంలో భారత్ సక్సెస్ అయ్యిందని పూరీ అన్నారు. ఇది గత దశాబ్దంతో పోలిస్తే 143శాతం పెరిగిందన్నారు. వార్షిక ఆదాయపు పన్ను రిటర్న్‌లు 2013-14 ఆర్థిక సంవత్సరంలో 3.6 కోట్లుగా ఉంటే.. 2024-25 ఆర్థిక ఏడాదిలో 8.5 కోట్లకు పెరిగాయని తెలిపారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఏఐ సాంకేతికతను వాడుకుంటూ చార్టెడ్ అకౌంటెంట్స్ ముందుకు సాగాలని సూచించారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవాలంటే ఇది చాలా అవసరమని హర్దీప్ సింగ్ పూరీ నొక్కి చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..