India at 79: “లిబరలైజ్ చేయడమే కాదు…లిబరేట్ చేయాల్సిన సమయం వచ్చింది”

భారతీయుల్లో నమ్మకం, ఆత్మవిశ్వాసమూ రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయని ఆధ్యాత్మిక గురువు సద్గురు అన్నారు. ఇప్పటివరకు మనం స్వేచ్ఛకు తలుపులు కొద్దిగా మాత్రమే తెరిచాం. ఇక నుంచి పూర్తిగా తాళం తీసేయాల్సిన సమయం వచ్చింది అని ఆయన స్పష్టం చేశారు. మన విద్యా వ్యవస్థ, పరిశ్రమలు, టెక్నాలజీ, రహదారులు – వంతెనలు కట్టే పనులు… ఇవన్నీ ప్రభుత్వ నియంత్రణల నుండి విడిపోవాలి. ప్రతి వ్యక్తి తన ప్రతిభను, సృజనాత్మకతను బయటకు తెచ్చుకునేలా స్వేచ్ఛ ఇవ్వాలన్నారు.

India at 79: లిబరలైజ్ చేయడమే కాదు…లిబరేట్ చేయాల్సిన సమయం వచ్చింది
Sadhguru

Updated on: Aug 15, 2025 | 3:37 PM

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు పూర్తవుతున్న వేళ.. దేశం ఎటు వెళ్తుంది? మన స్వేచ్ఛ అంటే ఏమిటి? అని సద్గురు ప్రశ్నించారు.
ఆయన మాట్లాడుతూ .. ‘ప్రపంచ ఆర్థిక మార్పులు, రాజకీయ ఒంటరితనం, మతం–కులం–ప్రాంతం పేరుతో మనసులో పడ్డ గోడలు… ఇవన్నీ మన ముందు నిలిచిన సవాళ్లు. కానీ ధైర్యమున్న దేశానికి, దూరదృష్టి ఉన్న నాయకత్వానికి సవాళ్లు అడ్డంకులు కావు. అవే మన ఎదుగుదలకు ఆహారమవుతాయి’ అన్నారు.

ప్రభుత్వం చేయనిదాన్ని ప్రజలు చేయాలి

“ఇప్పుడు కేవలం లిబరలైజ్ చేయడమే కాదు… నిజంగా ‘లిబరేట్’ చేయాల్సిన సమయం వచ్చింది. చదువు, పరిశ్రమ, టెక్నాలజీ, మౌలిక వసతులను ప్రభుత్వం చేతుల్లోనే ఉంచితే కుదరదు. వ్యక్తిగత ప్రతిభకు, సృజనాత్మకతకు మార్గం ఇవ్వాలి. రోడ్లు, వంతెనలు, విశ్వవిద్యాలయాలు… ఇవన్నీ నిర్మించడంలో ప్రజలు ముందుకు రావాలి. ఇది కేవలం ప్రభుత్వ పని కాదు” అని సద్గురు చెప్పారు.

Isha Foundation

అడ్డంకులు ఉంటాయి.. కానీ అది సహజం

“ఒకవేళ ఎవరు పెద్ద కలలు కంటారో, కొత్త పనులు చేయాలని చూస్తారో… వాళ్లు పాత రీతులు మార్చేస్తారు. అందుకే కొన్నిసార్లు పాత చట్టాలు, పాత పన్నుల నియమాలు కూడా మార్చాల్సి వస్తుంది. అది తప్పు కాదు, అదే అసలు మార్పు రాబట్టే దారి. కానీ ఇలాంటి కొత్త ఆలోచనల్ని, సృజనాత్మకతను ఆఫీసులలో ఫైళ్లలో పడేసి, సంతకాలు కోసం తిప్పుతూ, ఆలస్యం చేసి చంపేయకూడదు” అని వివరించారు.

భవిష్యత్తు – విద్య, టెక్నాలజీ, శక్తి

“ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మన బలమైన రంగం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో కూడా ప్రపంచం మన వైపు చూస్తోంది. కానీ దీనికి అవసరమైన పవర్‌ గ్రిడ్లు, స్టోరేజ్, నెట్‌వర్కింగ్.. ఇవి బలంగా లేకపోతే ఉపయోగం లేదు. చిన్న న్యూక్లియర్‌ ప్లాంట్లు తీసుకురావాలి. అంతే మన స్వయం ప్రతిపత్తి పెరుగుతుంది” సద్గురు చెప్పారు. “చదువు అంటే పుస్తకాల భారం కాదు… ఆలోచించే శక్తి, దేహ బలం పెంచే వ్యవస్థ కావాలి. చిన్నప్పుడే పిల్లల్లో సృజనాత్మకత పెంచాలి” అని ఆయన అన్నారు.

దేశం..  కొత్త దిశలో

“ఇది ఇక చిన్నపిల్లల దేశం కాదు. యువతలా.. ఉత్సాహంగా, కొత్తది ప్రయత్నించడానికి సిద్ధంగా ఉంది. రక్షణ పేరుతో చాలా కాలం అడ్డుకట్ట వేసాం. ఇప్పుడు తాళాలు విప్పాలి. సవాళ్లు అడ్డంకులు కావు. అవే మంటలు అంటించే దివిటీలు. మన దేశపు ఆత్మ వికసించాలంటే, ప్రజలకు నిజమైన స్వేచ్ఛ ఇవ్వాలి. ఇప్పుడు కేవలం లిబరలైజ్ చేయడం కాదు.. లిబరేట్ చేయాలి,” అని సద్గురు పిలుపునిచ్చారు.