
పశ్చిమాసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా దేశంలో ఇంధన భద్రత, ఎరువుల లభ్యత, భారతీయ పౌరుల రక్షణపై కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఈ మేరకు ఉన్నత స్థాయి సమావేశంలో పెట్రోలియం, విదేశీ వ్యవహారాలు, ఓడరేవులు, ఎరువుల శాఖల అధికారులు తాజా పరిస్థితిని వివరించారు. ప్రజలు వదంతులను నమ్మవద్దని, దేశంలో అన్ని నిత్యావసరాల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
గల్ఫ్ ప్రాంతం నుండి దిగుమతులు ప్రభావితమైనప్పటికీ.. రాబోయే ఖరీఫ్ సీజన్ కోసం ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉంది. గత ఏడాది 147 లక్షల టన్నులుగా ఉన్న ఎరువుల నిల్వలు, ప్రస్తుతం 180 లక్షల టన్నులకు చేరాయి. రష్యా నుండి కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా 28 లక్షల టన్నుల యూరియాను దిగుమతి చేసుకుంటున్నారు. సౌదీ అరేబియాతో ఏటా 31.10 లక్షల టన్నుల డీఏపీ కోసం ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఎరువుల సరఫరాను 24గంటలు పర్యవేక్షించడానికి ప్రత్యేక కంటింజెన్సీ వార్ రూమ్ ఏర్పాటు చేశారు. బ్లాక్ మార్కెటింగ్, నిల్వ చేయడం వంటి వాటిపై కఠిన నిఘా ఉంచాలని రాష్ట్రాలకు సూచించారు.
హార్ముజ్ జలసంధి మూసివేత భయాల నేపథ్యంలో ఇంధన సరఫరాపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. దేశంలోని అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ మరియు ఎల్‌పీజీ నిల్వలు తగినంతగా ఉన్నాయి. ప్రజలకు ఉపశమనం కలిగించేలా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 చొప్పున తగ్గించారు.కొన్ని చోట్ల భయాందోళనతో ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారని, అయితే ఎక్కడా కొరత లేదని ప్రభుత్వం ప్రకటించింది.
గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇస్తూ 100శాతం గ్యాస్ సరఫరాను కొనసాగిస్తున్నారు. వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల వాడకాన్ని తగ్గించి, హోటళ్లు, రెస్టారెంట్లకు పీఎన్‌జీ కనెక్షన్లు ఇచ్చేలా చర్యలు వేగవంతం చేశారు. వలస కార్మికుల కోసం గత రెండు రోజుల్లోనే 88,000కు పైగా 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు విక్రయించినట్లు ప్రభుత్వం తెలిపింది.
పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో భారతీయ నౌకలు, నావికుల భద్రతను డీజీ షిప్పింగ్ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో 18 భారతీయ నౌకలు, సుమారు 485 మంది నావికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. వివిధ సంఘటనల్లో మరణించిన 8 మంది భారతీయ పౌరుల కుటుంబాలకు సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
నిత్యావసర వస్తువుల చట్టం 1955 ప్రకారం.. బ్లాక్ మార్కెట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు ఇప్పటికే ప్రతిరోజూ సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు వాస్తవాలను వివరిస్తున్నాయి. కాగా పశ్చిమ ఆసియా సంక్షోభం దృష్ట్యా భారత్ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఇంధనం, ఆహారం, ఎరువుల విషయంలో దేశం సురక్షితంగా ఉందని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని కేంద్ర ప్రభుత్వం ఈ మీడియా సమావేశం ద్వారా భరోసా ఇచ్చింది.