వందే భారత్ రైలుపై కొందరు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడి ఘటనలో ఒక కోచ్‌లోని కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి నేపథ్యంలో ఆ కోచ్‌లోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది. పంజాబ్‌లోని ఫగ్వారాలో అమృత్‌సర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై బుధవారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు జరగలేదు కానీ.. వందే భారత్ రైలు కిటికీలు ధ్వంసమయ్యాయి. సి-3 కోచ్ కిటికీపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో సీ 3 కోచ్‌లోని రెండు విండో గ్లాస్‌లకు పగుళ్లు ఏర్పడ్డాయి.
రాళ్లు అద్దాలపై పడటంతో ఒక్క క్షణంలో పెద్ద శబ్దం వచ్చింది. అక్కడ కూర్చొన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. అయితే ఎవరికీ ఎలాంటి హాని జరుగకపోవడంతో ఊరట చెందారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న వందే భారత్ రైలు సిబ్బంది ఆ కోచ్ వద్దకు చేరుకున్నారు. రాళ్ల దాడిలో ధ్వంసమైన కిటికీ అద్దాలను పరిశీలించారు. కొందరు పిల్లలు రాళ్లు విసిరినట్లు ప్రయాణికులు ఆరోపించారు.
అయితే ఈ సంఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్గంలో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరగడం ఇదే తొలిసారి అని చెప్పారు. కానీ, వందేభారత్ రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనలు గతంలో అనేకం జరిగాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..