‘లేడి సింగం’ను కాదు.. ఐపీఎస్‌గా తిరిగొస్తా

| Edited By:

Jul 16, 2020 | 12:06 PM

లాక్‌డౌన్ నిబంధనలకు ఉల్లంఘించిన గుజరాత్ మంత్రి కుమారుడిని అడ్డుకొని సంచలనంగా మారిన మహిళా కానిస్టేబుల్‌ సునీతా యాదవ్ తన ఉద్యోగానికి రాజీనామాను ప్రకటించిన విషయం తెలిసిందే.

లేడి సింగంను కాదు.. ఐపీఎస్‌గా తిరిగొస్తా
Follow us on

లాక్‌డౌన్ నిబంధనలకు ఉల్లంఘించిన గుజరాత్ మంత్రి కుమారుడిని అడ్డుకొని సంచలనంగా మారిన మహిళా కానిస్టేబుల్‌ సునీతా యాదవ్ తన ఉద్యోగానికి రాజీనామాను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాను ఐపీఎస్‌గా తిరిగి వస్తానని సునీతా యాదవ్ అన్నారు. ఈ మేరకు ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీతా పలు విషయాలను పంచుకున్నారు.

”నేను లేడి సింగంను కాదు. నేను కేవలం ప్రజలను రక్షించే అధికారిని. నా డ్యూటీ మాత్రమే నేను చేశా. చాలా మంది పోలీసులు ఇలా చేయకపోవడం వల్లనేమో నన్ను లేడి సింగం అని పిలుస్తున్నారు. కానీ వాళ్లు పిలిచినప్పుడు నాకు ఆనందంగా ఉంది” అని సునీతా యాదవ్ అన్నారు. ‘ఒకప్పుడు ఖాకీ ధరించిన వారికే పవర్‌ ఉంటుందని అనుకునేదాన్ని. కానీ ఈ ఘటన తరువాత నేను ఐపీఎస్‌ కావాలనుకుంటున్నాను. అందుకోసం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా. ర్యాంక్‌తోనే నేను తిరిగి రావాలనుకుంటున్నా. ఈ ఘటన త్వరగానే ముగిసేది. కానీ నాకు ర్యాంక్ లేదు కాబట్టి గమ్‌లాగా సాగుతూనే ఉంటుంది’ అని సునీతా తెలిపారు.

ఇక మంత్రి కుమారుడిని అడ్డుకున్న ఘటన గురించి మాట్లాడుతూ.. ”కర్ఫ్యూ ఉన్నప్పటికీ సరైన కారణం ఉన్న కొన్ని వాహనాలకు అనుమతిని ఇస్తుంటాం. కానీ మంత్రి కుమారుడు, అతడి స్నేహితుల వద్ద సరైన కారణం లేదు. చట్టం ప్రకారం నా పని నేను చేసుకుపోవాలి. అందుకే వారిని అడ్డుకున్నా. నాకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. మంత్రి అనుచరుల నుంచి నాకు ముప్పు ఉంది. రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులను కోరాను. నాకు ఫోన్‌లో బెదిరింపులు వచ్చాయి. సమస్యను పరిష్కరించుకుంటే రూ.50లక్షలు ఇస్తామని రాయబారం కూడా పంపారు.” అని సునీతా చెప్పుకొచ్చారు. ఇక ఐపీఎస్‌గా ఎంపికై తిరిగి పోలీసు శాఖలోకి వస్తానని, అది సాధ్యం కాకపోతే ఎల్‌ఎల్‌బీ చేస్తానని, లేదంటే జర్నలిస్ట్ అవుతానని సునీతా వివరించారు. కాగా సునీతా రాజీనామా లేఖను ఇంకా ఉన్నతాధికారులు ఆమోదించనున్నట్లు తెలుస్తోంది.