
మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లాలో సినిమా ఫక్కీలో జరిగిన ఒక కిడ్నాప్ ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. ఒక మహిళను, ఆమె మూడు నెలల పసికందును సాయుధులైన కొందరు వ్యక్తులు బలవంతంగా తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో నిక్షిప్తమవ్వడం కలకలం రేపింది. అయితే, ఈ కిడ్నాప్ వెనుక ఉన్నది మరెవరో కాదు.. ఆ మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తి కావడం ఈ కథలో అసలు ట్విస్ట్..! ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
శివ్‌పురి పబ్లిక్ స్కూల్ సమీపంలో నివసించే మెహక్ గుహారియా, పుష్పేంద్ర చౌహాన్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఇండోర్‌లో లివ్-ఇన్ రిలేషన్‌లో ఉండేవారు. అయితే, 2025 అక్టోబర్‌లో వీరి మధ్య మనస్పర్థలు రావడంతో మెహక్ తన మూడు నెలల కుమార్తెతో కలిసి శివ్‌పురిలోని తన తల్లిగారి ఇంటికి వచ్చేసింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన పుష్పేంద్ర, ఆమెను తిరిగి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
శుక్రవారం (మే 08) అర్ధరాత్రి పుష్పేంద్ర తన పదిమంది స్నేహితులతో కలిసి మెహక్ ఇంటిపై దాడి చేశాడు. పదునైన ఆయుధాలతో ఇంట్లోకి చొరబడి, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి మెహక్‌ను, ఆమె చిన్నారిని బలవంతంగా తీసుకెళ్లారు. ఈ దృశ్యాలన్నీ స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితురాలి తల్లి నీలమ్ గుహారియా ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి, పుష్పేంద్రతో సహా 11 మందిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మెహక్ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేసింది. అందులో తాను కిడ్నాప్ కాలేదని, తన ఇష్టపూర్వకమే పుష్పేంద్రతో కలిసి వెళ్లానని పేర్కొంది. కానీ, ఆమె తల్లి నీలమ్ మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. నాలుగు రోజుల క్రితమే పుష్పేంద్ర మెహక్‌పై దాడి చేశాడని, ఇప్పుడు ఆయుధాలతో బెదిరించి బలవంతంగా తీసుకెళ్లారని ఆమె ఆరోపిస్తున్నారు. శివ్‌పురి ఎస్‌డీఓపీ సంజయ్ చతుర్వేది మాట్లాడుతూ, వైరల్ వీడియోను గమనించామని, అయితే సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తున్న దృశ్యాలు అనుమానాస్పదంగా ఉన్నాయని తెలిపారు.
ఇద్దరూ ఇప్పటికే కలిసి ఉంటున్నప్పుడు, ఇలా అర్ధరాత్రి ఆయుధాలతో వచ్చి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఇది నిజంగా కిడ్నాపా లేక నాటకమా అన్న కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ప్రేమ వ్యవహారం కాస్తా నేర చరిత్రగా మారడం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
వీడియో ఇక్కడ చూడండి…
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..