ఆకాశవాణి భవన్‌ వద్ద హైటెన్షన్.. రాహుల్‌గాంధీ సహా పలువురు నేతల అరెస్ట్..!

కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష నేతలను ఢిల్లీ పోలీసులు అడ్డుకోవడంతో మంగళవారం (అక్టోబర్ 06) ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వైపు మార్చ్ చేపట్టారు. పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి మార్చ్‌ను అడ్డుకున్నారు. దీంతో పలువురు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు నేతలలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆకాశవాణి భవన్‌ వద్ద హైటెన్షన్.. రాహుల్‌గాంధీ సహా పలువురు నేతల అరెస్ట్..!
Rahul Gandhi Arrested

Updated on: Oct 06, 2026 | 8:32 PM

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష నేతలను ఢిల్లీ పోలీసులు అడ్డుకోవడంతో మంగళవారం (అక్టోబర్ 06) ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వైపు మార్చ్ చేపట్టారు. పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి మార్చ్‌ను అడ్డుకున్నారు. దీంతో పలువురు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు నేతలలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, టీఎంసీ నేతలు అభిషేక్ బెనర్జీ, డెరెక్ ఓబ్రెయిన్ తదితరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ఎన్నికల సంఘం పనితీరుకు వ్యతిరేకంగా ఇండియా బ్లాక్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ఢిల్లీలో ఉద్రిక్తంగా మారింది. మంగళవారం (అక్టోబర్ 6) పార్లమెంట్‌ నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ‘నిర్వాచన్ సదన్’ వరకు 300 మందికి పైగా ప్రతిపక్ష ఎంపీలు పాదయాత్ర చేపట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన నిర్వహించారు.

పాదయాత్ర సందర్భంగా పోలీసులు, నిరసనకారుల మధ్య పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల సంఘం కార్యాలయంలోకి ప్రతిపక్ష నేతలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎన్నికల సంఘం గేటు వద్దకు చేరుకున్న కొందరు కార్యకర్తలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. ప్రాంతంలో BNSS సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పోలీసులు తెలిపారు.

ఎన్నికల సంఘానికి సుమారు 100 మీటర్ల దూరంలోని ఆకాశవాణి కాంప్లెక్స్ వద్ద రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు ధర్నాకు కూర్చున్నారు. అనంతరం పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను కూడా పోలీసులు బస్సుల్లో అక్కడి నుంచి తరలించారు.

ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లను కలిసేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అధికారికంగా లేఖ పంపినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఒకటి రెండు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తామని ఎన్నికల సంఘం నుంచి హామీ వస్తే నిరసనను విరమించే అంశాన్ని రాహుల్ గాంధీ పరిశీలించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే 300 మంది ఎంపీలతో కలిసి ఎన్నికల సంఘాన్ని కలవాలన్నది రాహుల్ ప్రధాన డిమాండ్‌గా ఉన్నట్లు సమాచారం.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తాము ఎన్నికల సంఘాన్ని కలిసి ఓట్ల జాబితా సవరణపై ప్రశ్నలు అడగాలనుకుంటున్నామని, కానీ తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పోలీసులు తనను అక్కడి నుంచి తొలగించాలనుకుంటే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. దేశంలో ప్రతిపక్ష నాయకుడు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు ఎక్కడ కూర్చోవాలని ఆయన అన్నారు.

మరోవైపు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్షాల ఆందోళనపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టుపై చేస్తున్న దాడులకు ముగింపు పలకాలని అన్నారు. ఎన్నికల్లో ప్రజల తీర్పు పొందడంలో విఫలమైన తర్వాత ఎన్నికల సంఘాన్ని నిందించడం సరికాదని విమర్శించారు. నిరసనలతో ప్రజాస్వామ్యం బలోపేతం కాదని వ్యాఖ్యానించారు.

కాగా, SIR ప్రక్రియ, ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై ప్రతిపక్షాలు కొంతకాలంగా ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నాయి. తాజా నిరసనతో ఈ వివాదం మరోసారి రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ప్రతిపక్ష ఎంపీలను అదుపులోకి తీసుకోవడం, పోలీసులతో జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఢిల్లీలో పరిస్థితి ఉత్కంఠగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Loading...
Unable to load recommendations.
Follow Us