Varanasi Rains Video: కాశీలో నీట మునిగిన 80 ఘాట్లు… ఉత్తరాది రాష్ట్రాల్లో కుంభవృష్టి

దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో కుంభవృష్టి కురుస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, బెంగాల్‌ రాష్ట్రాల్లో వరద పరిస్థితి కొనసాగుతోంది. రుతుపవనాల కారణంగా కురుస్తున్న వర్షాలు రాజస్థాన్‌ను వణికిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న...

Varanasi Rains Video: కాశీలో నీట మునిగిన 80 ఘాట్లు... ఉత్తరాది రాష్ట్రాల్లో కుంభవృష్టి
Kasi Rains

Updated on: Jul 18, 2025 | 12:16 PM

దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో కుంభవృష్టి కురుస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, బెంగాల్‌ రాష్ట్రాల్లో వరద పరిస్థితి కొనసాగుతోంది. రుతుపవనాల కారణంగా కురుస్తున్న వర్షాలు రాజస్థాన్‌ను వణికిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల.. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.

ముఖ్యంగా కోటా, పాలి, జాలోర్, ధోల్పూర్ జిల్లాల్లో వర్షాల తీవ్రత అధికంగా ఉండటంతో రహదారులు, నివాసాలు నీట మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లకు పగుళ్లు వచ్చాయి కొన్నిచోట్ల గోడలు కూలిపోయాయి. చంబల్ నది పరివాహక ప్రాంతాల్లో.. వర్షపాతం అధికంగా ఉండటంతో నది పొంగిపొర్లుతోంది. కోటా నగరంలో వందలాది ఇళ్లు నీటిలో చిక్కుకుపోయాయి. అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు

మరోవైపు జార్ఖండ్, బెంగాల్‌, ఉత్తరాప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. జార్ఖండ్‌లో కూడా వరద పోటెత్తుతోంది. పాలము, గర్వా, లతేహార్‌ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చేశారు. IMD హెచ్చరికలతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బెంగాల్‌లోని పలు జిల్లాల్లో వరద ఉధృతి కనిపిస్తోంది. హౌరా, హుగ్లీ, ఈస్ట్ బుర్ద్వాన్‌ సహా మరికొన్ని చోట్ల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మొత్తం 10 జిల్లాలపై ప్రభావం ఉండడంతో సహాయ చర్యల విషయంలో అధికారుల్ని అప్రమత్తం చేశారు.

అటు ఉత్తరప్రదేశ్‌లో భారీవర్షాలు కురుస్తున్నాయి.ఎగువన ఇంకా వర్షబీభత్సం కొనసాగుతుండడంతో గంగానది ఉధృతంగా ప్రవహిస్తోంది. వారణాసి, ప్రయాగ్‌రాజ్‌లోని కొన్ని ప్రాంతాలు ముంపు ముప్పులోనే ఉన్నాయి. కాశీలో దాదాపు 80 ఘాట్‌లు నీటమునిగాయి. 24 గంటల్లోనే గంగానదిలో మీటరు మేర నీటిమట్టం పెరిగింది.. ఈ ఉధృతి ఇంకా కొనసాగే ప్రమాదం ఉండడంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది.

 

వీడియో చూడండి: