4 గంటల పాటు గాల్లోనే విమానం.. వెక్కి వెక్కి ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్

హైదరాబాద్ నుంచి హుబ్లీకి వెళ్లాల్సిన ఫ్లై91 ఎయిర్‌లైన్స్ విమానం 4 గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ప్రయాణికులు భయానికి గురయ్యారు. ఈసందర్భంగా విమానంలో ఉద్వేగ సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

4 గంటల పాటు గాల్లోనే విమానం.. వెక్కి వెక్కి ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్
Flight

Updated on: Apr 20, 2026 | 9:45 PM

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరిన ఫ్లై91 ఎయిర్‌లైన్స్ విమానం IC3401 (ATR టర్బోప్రాప్ AT7) ఆదివారం సాయంత్రం హుబ్లీలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించకపోవడం వల్ల నాలుగు అధికారులు ల్యాండింగ్ వాయిదా వేశారు. దీంతో నాలుగు గంటల పాటు ఆ విమానం గాల్లోనే చక్కర్లు కొడుతూ ఉంది. శిమమొగ్గ, ముందగోడ్, దావణగారె వంటి ప్రాంతాల్లో విమానం చక్కర్లు కొట్టింది. చివరికి అధికారులు పరిస్థితిని చక్కబెట్టాక విమానం రాత్రి 7.30 గంటలకు ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. విమానాన్ని దారి మళ్లించి బెంగళూరులో కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాంగ్ చేశారు. అయితే విమానం గాల్లోనే చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. చాలామంది దేవుడిని ప్రార్థిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వెక్కి వెక్కి ఏడ్చిన మహిళ

ఒక మహిళ చేతులు జోడించి దేవుడికి ప్రార్థన చేసింది. వెక్కి వెక్కి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. శరీరం వణికిపోతుండగా..నిశ్శబ్దంగా ప్రార్థన చేసింది. ఇక ఓ మై గాడ్.. అయ్యో దేవుడా.. ఇతను ఎందుకిలా చేస్తున్నాడు అని అరుస్తున్నట్లు వీడియోలో ఉంది. ఇక ఏడవకు.. ఏడవకు.. ఏమీ లేదు.. ఆగు అని ఒక వ్యక్తి చెప్పినట్లు వీడియోలో వినిపిస్తుంది. ఇక విమానాన్ని నిలిపి ఉంచామని, ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని ప్రయాణికులకు పైలట్ చెప్పినట్లు వీడియోలో స్వరం వినిపిస్తుంది. ఓపికగా ఉండాలని, దయచేసి తమ సూచనలను పాటించాలని పైలట్ చెప్పినట్లు ఉంది. అయితే బెంగళూరుకు తిరిగి వెళ్లాలని ఓ ప్రయాణికుడు చెప్పగా.. అవును.. అది దగ్గరలోనే ఉందని మరో ప్రయాణికుడు అంగీకరించాడు.

స్పందించిన విమానయాన సంస్థ

అయితే ఈ ఘటనపై విమానయాన సంస్థ స్పందించింది. విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తలేదని స్పష్టం చేసింది. హుబ్లీకి సమీపిస్తుండగా ప్రతికూల వాతావరణం కారణంగా విమానాన్ని బెంగళూరుకు మళ్లించారని, భద్రత విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదని తెలిపింది. బెంగళూరుకు మళ్లించడం కార్యచరణలో భాగమేనని, పరిశ్రమ అనుసరిస్తున్న ఉత్తమ పద్దతుల్లో ఇది ఒకటి అని పేర్కొంది. అత్యంత నైపుణ్యం కలిగిన పైలట్లు, గ్రౌండ్ సిబ్బంది టీమ్ ఉందని. ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా నిర్వహించడానికి ట్రైనింగ్ పొంది ఉన్నారని వెల్లడించింది. తమ ఎయిర్‌లైన్‌కు అత్యుత్తమ భద్రతా రికార్డ్ ఉందని నొక్కి చెప్పింది.

Follow Us