
మోనూ అనే యువకుడు గత రెండ్రోజులుగా కనిపించట్లేదని పోలీసులకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అతని ఆచూకీ కోసం వెతగ్గా.. ఓ కాలువ పక్కన అతని స్కూటర్.. అదే కాలువలో అతని మృతదేహం లభ్యమైంది. అయితే అతని మరణంపై బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో కేసును మరో కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు సంచలన నిజాలు తెలిశాయి. మోనును అతని భార్యే ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో మృతుడి భార్య తన్ను, ఆమెకు సహకరించిన హరిఓం అనే యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ కేసు ప్రధాన నిందితుడిగా ఉన్న తన్ను ప్రియుడు, మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు.
అసలేం జరిగింది?
బావల్ డీఎస్పీ సురేంద్ర షియోరన్ తెలిపిన వివరాల ప్రకారం… జార్తల్ గ్రామానికి చెందిన మోనూ అనే యువకుడికి కొన్నాళ్ల క్రితం తన్ను అనే యువతితో వివాహం జరిగింది. వీళ్లు ఫ్యామిలీలో కలిసి జర్తల్ గ్రామంలో నివసిస్తున్నారు. అయితే మోనూ జూన్ 8వ తేదీ రాత్రి మందులు కొనడానికి తన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొని వెళ్లాడు.. కానీ అతను తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కంగారు పడిన పేరెంట్స్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఘటనపై మిస్సింగ్ కేసు నమెదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే జూన్ 10న గ్రామ సమీపంలోని అసల్వాస్ కాలువలో మోనూ మృతదేహం లభ్యమవగా, ఆ పక్కనే అతని స్కూటీ కూడా దొరికింది. అయితే మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు తొలుత దీన్ని ప్రమాదంగా భావించి పోస్ట్‌మార్టానికి తరలించారు. అయితే మోనూ మృతిపై బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో కేసు మలుపు తిరిగింది. కుటుంబ సభ్యుల అనుమానాల ఆధారంగా పోలీసులు దీనిని హత్య కేసుగా నమోదు చేసి, ఫోన్ కాల్ డేటా, ఇంటెలిజెన్స్ సమాచారంతో విచారణ ప్రారంభించారు.
అప్పుడే పోలీసులకు అసలు విషయం తెలిసింది. తన్నూకు మోనూతో పెళ్లి ఇష్టం లేకుండా జరిగిందని.. అంతకు ముందు ఆమెకు మరో యువకుడితో ప్రేమ వ్యవహారం ఉందని.. వాళ్లు ఇప్పటికీ టచ్‌లో ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అంతేకాదు.. తమ అడ్డంగా ఉన్నాడని.. మోనూను అడ్డు తొలగించేందుకు భార్య తన్ను, తన ప్రియుడితో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 8 రాత్రి తన్ను ఫోన్ చేసి మోనూను కసోలి గ్రామానికి రప్పించిందని.. ముందు ప్లాన్ చేసినట్టు అప్పటికే ఆమె ప్రియుడు సోను, అతని స్నేహితులు హరిఓం, అమన్ అక్కడ కాచుకొని ఉన్నట్టు తేలింది. మోనూ అక్కడి చేరుకోగానే అతన్ని పట్టుకొని అతనిపై దాడి చేశారు. మోనూ స్పృహ తప్పిపడిపోవడంతో అతన్ని సమీపంలోని కాలువలో పడేసి అక్కడి నుంచి పారిపోయారు. కానీ పోలీసులు దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి రావడంతో భార్య తన్ను, హరిఓంలను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చగా కోర్టు వారిని కస్టడీకి విధించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.