సైనైడ్ కంటే 6వేల రెట్లు ప్రమాదం.. భారీ ఉగ్రకుట్రను చేధించిన గుజరాత్ ఏటీఎస్..

భారీ ఉగ్రవాద కుట్రను గుజరాత్ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ భగ్నం చేసింది. ISIS అనుబంధ సంస్థ అయిన ISKPతో సంబంధం ఉన్న డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ సహా ముగ్గురు వ్యక్తులను ATS అరెస్టు చేసింది. వీరు అత్యంత ప్రమాదకరమైన రిసిన్‌ను తయారు చేసి.. దేశంలో ఉగ్ర దాడులు చేయాలని ప్లాన్ చేశారు.

సైనైడ్ కంటే 6వేల రెట్లు ప్రమాదం.. భారీ ఉగ్రకుట్రను చేధించిన గుజరాత్ ఏటీఎస్..
Gujarat Ats Foils Iskp Ricin Plot

Updated on: Nov 11, 2025 | 9:14 AM

ఢిల్లీ పేలుడు ఒక్కసారిగా ప్రజలను వణికించింది. 13 ఏళ్ల తర్వాత ఢిల్లీలో జరిగిన పేలుడుతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో 8మంది మరణించగా.. 20మందికిపైగా గాయపడ్డారు. అయితే ఈ ఘటన కంటే ముందే గుజరాత్ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసింది. వీరిలో ఒకరు చైనాలో వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్ ఉండడం గమనార్హం. డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి.

ఈ ముగ్గురు వ్యక్తులు ISIS అనుబంధ సంస్థ అయిన ISKP (ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్) తో కలిసి పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వారు అత్యంత ప్రమాదకరమైన విషం అయిన రిసిన్ ను తయారు చేయడానికి ప్రణాళికలు వేశారు. దేశంలో ఉగ్రవాద దాడులు చేసి అలజడి సృష్టించడమే వారి లక్ష్యం. నిందితులు అహ్మదాబాద్, ఢిల్లీ, లక్నోలలోని అనేక సున్నితమైన, మతపరమైన భవనాలు, ముఖ్యంగా RSS కార్యాలయాల భద్రతా, జనసందోహం గురించి రెక్కీ నిర్వహించినట్లు వెల్లడైంది. తాజాగా జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ ఇద్దరు నిందితులు కశ్మీర్‌ను కూడా సందర్శించినట్లు దర్యాప్తులో తేలింది. డాక్టర్ సయ్యద్ రిసిన్‌ను ఎలా ఉపయోగించాలో లేదా ఎప్పుడు దాడి చేయాలో పాకిస్తాన్‌కు చెందిన హ్యాండ్లర్ల నుండి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు అధికారులు చెప్పారు. నిందితుల నుంచి మూడు పిస్టల్స్, 30 బుల్లెట్లు దాదాపు నాలుగు లీటర్ల ఆముదంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు

రిసిన్ అంటే ఏమిటి?

రిసిన్ అనేది సాధారణంగా పెంచే ఆముదం గింజల నుండి తీసే చాలా విషపూరితమైన పదార్థం. ఇది సైనైడ్ కంటే 6వేల రెట్లు ఎక్కువ ప్రాణాంతకం. ఇది చాలా తక్కువ మోతాదులో తీసుకున్నా లేదా ఇంజెక్ట్ చేసినా మనుషులను చంపేయగలదు. అందుకే దీనిని జీవ ఆయుధంగా వాడతారు. దీనికి ప్రత్యేకమైన మందు లేదు. ప్రపంచవ్యాప్తంగా దీనిని రసాయన ఆయుధాల జాబితాలో చేర్చారు. గతంలో బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ వంటి ప్రముఖులపై ఈ రిసిన్ విష ప్రయోగం చేసేందుకు ప్రయత్నాలు జరిగ్గా.. భద్రతా దళాలు ఆ దాడులను ఆదిలోనే అడ్డుకున్నాయి. కాగా నిందితుల నుంచి డు పిస్టల్స్, 30 బుల్లెట్లు దాదాపు నాలుగు లీటర్ల ఆముదంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.