
అమరావతి, ఆగస్ట్ 17: అమరావతి జిల్లాలోని చిఖల్‌దరా తాలూకా డోమా గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాల నిర్వహిస్తున్నారు. ఉత్తర మహారాష్ట్రలోని గిరిజనులు అధికంగా నివసించే మెల్‌ఘాట్ ప్రాంతంలో ఉన్న ఈ పాఠశాలలో సుమారు 810 మంది బాలబాలికలు చదువుతున్నారు. జూలై 22న నలుగురు బాలికలు అకస్మాత్తుగా వింతగా ప్రవర్తించడం ప్రారంభించడంతో ఈ ఘటనకు తెరలేచింది. వారు అదుపు లేకుండా ఏడవడం, నవ్వడం వంటి లక్షణాలు ప్రదర్శించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఇతర విద్యార్థుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. కొందరు బాలికలు హాస్టల్‌లో గజ్జెల శబ్దం వినిపించిందని చెప్పడంతో ‘దెయ్యాలు పట్టాయి’ అనే ప్రచారం వేగంగా వ్యాపించింది.
పుకార్లు విస్తరించడంతో విద్యార్థుల్లో భయం మరింత పెరిగింది. కొన్ని రోజుల వ్యవధిలో సుమారు 600 మంది విద్యార్థులు ‘దెయ్యాల హాస్టల్’గా భావించి ఇళ్లకు వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. ఒకేసారి ఇంతమంది విద్యార్థులు హాస్టల్ నుంచి వెళ్లిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ఆరోగ్య నిపుణుల బృందాన్ని పాఠశాలకు పంపించారు. గిరిజన అభివృద్ధి శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. బాలికల్లో కనిపించిన లక్షణాలకు అతీంద్రియ శక్తులతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మానసిక ఒత్తిడి కారణంగా కొందరిలో కనిపించే ‘సెలెక్టివ్ హిస్టీరియా’ తరహా పరిస్థితి అయి ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో భయం, ఒత్తిడి, చుట్టుపక్కల వ్యాపించిన పుకార్లు ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేసి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అధికారులు రూపొందించిన మానసిక ఆరోగ్య నివేదికలో ఘటనకు సంబంధించి స్థానికంగా ప్రచారంలో ఉన్న పలు కారణాలను ప్రస్తావించారు.
పాఠశాల ఉన్న ప్రాంతంలో గతంలో ఓ ‘మహువా’ చెట్టు ఉండేదని, దానిపై ఆత్మలు నివసించేవని విద్యార్థులు, స్థానికుల్లో నమ్మకం ఉందని నివేదికలో పేర్కొన్నారు. పాఠశాల యాజమాన్యం ఆ చెట్టును తొలగించడంతో ఆత్మలు కోపించి విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయనే ప్రచారం మొదలైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు పాఠశాల వెనుక ఉన్న తమ దేవత ఆలయం వద్దకు పాఠశాల డ్రైనేజీ కాలువ రావడం లేదా ఆ ప్రాంతం ఆక్రమణకు గురికావడంతో దేవత ఆగ్రహించిందనే మరో నమ్మకం కూడా వ్యాపించినట్లు నివేదికలో పేర్కొన్నారు. అలాగే పాఠశాలకు సమీపంలోని పొలంలో ఓ ఆదివాసీ యువకుడు మరణించాడని, అతని ఆత్మ దెయ్యంగా మారి విద్యార్థులను వేధిస్తోందనే ప్రచారం కూడా జరిగినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల్లో చోటుచేసుకున్న అసాధారణ ప్రవర్తనకు మూఢనమ్మకాలు, భయం, మానసిక ఒత్తిడి, స్థానిక నమ్మకాలే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయని అధికారుల నివేదిక పేర్కొంది. ఒకరి ప్రవర్తనను చూసి మరికొందరు బాలికలు కూడా అదే విధంగా స్పందించే అవకాశం ఉండటంతో పరిస్థితి విద్యార్థుల్లో వేగంగా వ్యాపించి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. గ్రామంలోని కొంతమంది మహిళల్లో కూడా ఆ తర్వాత ఇలాంటి మానసిక లక్షణాలు కనిపించినట్లు నివేదికలో వెల్లడించారు.
విద్యార్థులకు కౌన్సెలింగ్
పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. మూఢనమ్మకాల నిర్మూలన కోసం పనిచేస్తున్న మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి ప్రతినిధులు కూడా విద్యార్థులను కలిసి మాట్లాడారు. ఈ ఘటనను అతీంద్రియ శక్తుల కోణంలో కాకుండా శాస్త్రీయ దృక్పథంతో చూడాలని వారు విద్యార్థులు, స్థానికులకు సూచించారు. భయపడాల్సిన అవసరం లేదని, మానసిక ఒత్తిడి లేదా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించాలని సూచించారు. అమరావతి ఎంపీ బల్వంత్ వాంఖడే కూడా విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. తిరిగి పాఠశాలకు వచ్చి తరగతులకు హాజరు కావాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. బాలికలకు కౌన్సెలింగ్ ఇచ్చి వారిని తిరిగి పాఠశాలకు తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే కొంతమంది విద్యార్థులు పాఠశాలకు తిరిగి వచ్చినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంజయ్ చౌదరి తెలిపారు.