
చిత్రకూట్, జనవరి 22: ప్రేయసిని బెదిరించేందుకు ప్రియుడు వీడియో కాల్ చేసి ఉరి నాటకం ఆడాడు. అయితే అనుకోకుండా ఈ స్టంట్ కాస్తా నిజమై ఉరి మెడకు బిగుసుకుంది. దీంతో ప్రేయసి కళ్లముందే ప్రియుడు ప్రాణాలు వదిలాడు. ఈ దారుణం కళ్లప్పగించి చూసిన ప్రేయసి కూడా భయంతో తన ఇంట్లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరూ వేర్వేరు ప్రదేశాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఒకరు మధ్య ప్రదేశ్ లో, ఇంకొకరు రాజస్థాన్ లో వేర్వేరు రాష్ట్రాల్లో ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం..
మధ్య ప్రదేశ్ లోని చిత్రకూట్ కు చెందిన రవి (పేరు మార్చాం).. రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన నందిని (పేరు మార్చాం) గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్నారు. ఇటీవల ఇరువురి కుటుంబాలు కూడా వారి పెళ్లికి అంగీకరించాయి. వారి పెళ్లి త్వరలోనే జరగాల్సి ఉంది. ఇంతలో ఏమైందో తెలియదు గానీ ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. ఎవరి సొంతూరిలో వారు ఉన్నారు. ఇటీవల ఇద్దరూ వీడియో కాల్ చేసుకుని మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ఒకరితో ఒకరు వాదులాడుకున్నారు. ఇంతలో రవి ఆవేశంగా చనిపోతానని బెదిరించాడు. అంతటితో ఆగకుండా ప్రేయసిని బెదిరించేందుకు ఉరి వేసుకుంటున్నట్లు స్టంట్ చేశాడు. కానీ అనుకోకుండా నిజంగానే ఉరి మెడకు బిగుసుకు పోవడంతో వీడియో కాల్ లోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. సంఘటన సమయంలో అతడు చిత్రకూట్‌లో ఉన్నాడు.
ప్రియుడి మరణించడం చూసిన నందిని కూడా ఆవేదనతో జైపూర్లోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వేర్వేరు చోట్ల ప్రేయసి, ప్రియుడు ఇద్దరూ ఒకే రోజు ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు మృతుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు వారి వారి సొంతూళ్లలో దహనం చేశారు. ఈ సంఘటన చిత్రకూట్‌లోని బర్గర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ మరణాలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.