సోషల్ మీడియా వచ్చాక.. ప్రపంచంలో ఎక్కడ ఏ వింత ఘటన జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. ఇది దీనికున్న పవర్. ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం జరిగితే.. ఈ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తే.. క్షణాల్లో వైరల్‌గా మారుతున్న ఘటనలు అనేకం. ముఖ్యంగా మన దేశంలో అయితే ఎక్కడైనా ధరలు పెరిగినా.. అక్రమంగా అధిక ధరలు వసూలు చేసినా.. ఈ మధ్య సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం పరిపాటిగా మారింది.
గతంలో రెండు అరటి పండ్లకు వందల్లో బిల్లు వేసిన ఘటనను చూశాం. అయితే ఇప్పుడు అలాంటి కోవలోకి ఓ స్టార్ హోటల్ వచ్చిపడింది. ఈ హోటల్ స్పెషాలిటీ ఎంటో తెలిస్తే షాక్ తింటారు. మీరు కలలో కూడా ఊహించని ధరలు ఇక్కడ ఉంటాయి. అది కూడా కొడిగుడ్డు ధర. సామాన్యంగా గుడ్డు ధర మహా అయితే రూ.5 ఉంటుంది. ఒకవేళ ధరలు పెరిగితే.. రూ.7 మొత్తానికి పదిరూపాయలలోపే ఉంటుంది. ఇక ఇది గుడ్డును హోటల్స్, రెస్టారెంట్స్‌లలో ఉడకబెట్టి అమ్మితే రూ.20 నుంచి 30 ఉంటుంది. అది కూడా పెద్ద పెద్ద వాటిల్లో అయితేనే.. లేదంటే పదిహేను రూపాయలలోపే వస్తుంది. అయితే గుజరాత్ అహ్మదాబాద్‌లోని ఓ స్టార్ హోటల్లో మాత్రం గుడ్ల ధరలను చూస్తే.. ఉలిక్కిపడతారు. మూడు కోడిగుడ్లకు వేలల్లో బిల్లు వేసింది ఈ హోటల్.
వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ సంగీత దర్శకుడు శేఖర్ రావ్‌జియాని.. గురువారం హయత్ రీజెన్సీ స్టార్ హోటల్‌లో మూడు ఉడకబెట్టిన కోడిగుడ్లతో భోజనం ఆర్డర్ ఇచ్చారు. అయితే భోజనం చేసిన తర్వాత వచ్చిన బిల్లు చూసి ఆయన ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మూడు కోడిగుడ్ల ధర ఏకంగా రూ.1672లుగా ఉంది. అది కూడా జీఎస్టీతో కలిపి అని ఉంది. అయితే ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఆ బిల్లులో మూడు ఉడికించిన కోడిగుడ్లకు గాను రూ.1350, సర్వీస్ ఛార్జీగా రూ.67, సీజీఎస్టీ రూ.127, ఎస్‌జీఎస్టీ 127.. మొత్తం బిల్లు రూ.1672లుగా ఉంది. ఆ బిల్లుకు సంబంధించిన ఫోటోను శేఖర్ ట్విట్ చేయడంతో ఇది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.
Rs. 1672 for 3 egg whites???
That was an Eggxorbitant meal ? pic.twitter.com/YJwHlBVoiR— Shekhar Ravjianii (@ShekharRavjiani) November 14, 2019