Tamilanadu Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ హీరో విజయ్ మరో కీలక ప్రకటన

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల క్రమంలో TVK అధ్యక్షుడు, హీరో విజయ్‌ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల కోసం ప్రచార కమిటిని అనౌన్స్ చేశారు. ఈ కమిటి ఆధ్వర్యంలోనే సభలు, సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు. ఎన్నికల్లో పోటీకి సిద్దంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు.

Tamilanadu Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ హీరో విజయ్ మరో కీలక ప్రకటన
Vijay

Updated on: Jan 18, 2026 | 7:34 AM

తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడ రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. పార్టీలన్నీ గెలుపొందేందుకు ఇప్పటినుంచే ప్రచారం మొదలుపెట్టాయి. ఎన్నికల మేనిఫెస్టోలను కూడా విడుదల చేస్తూ ప్రజలను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోన్నాయి.  ఈ సారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. ఎందుకంటే మరో కొత్త పార్టీ బరిలోకి దిగుతోంది. అదే హీరో విజయ్ స్థాపించిన TVK పార్టీ.  టీవీకే పార్టీ కూడా ఎన్నికలకు సిద్దమవుతోంది. ఇటీవల విజయ్ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో ముందడుగు వేశారు. శనివారం పార్టీ ప్రచార కమిటీని విజయ్ ప్రకటించారు.

ఎన్నికల బరిలో..

కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన చేదు జ్ఞాపకాన్ని మిగిల్చినా వెనుకడుగు వేయకుండా ఎన్నికల బరిలో ముందుకే అడుగేస్తున్నారు TVK అధ్యక్షుడు విజయ్‌. ఒకవైపు తన అభిమానులకు, మరోవైపు రాజకీయ వ్యూహకర్తలను ఆసరాగా చేసుకుని రాజకీయ రణక్షేత్రంలో విజయబావుటా ఎగురవేసేందుకు ఎత్తులు వేస్తున్నారు. కరూర్‌ తొక్కిసలాట ఘటన తర్వాత కోర్టులు, కేసులు కొంత అడ్డంకిగా మారాయి. అయితే అవేమి పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారు ఇళయ దళపతి. తాజాగా 10 మంది పేర్లతో పార్టీ ప్రచార కమిటీని ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్, జనరల్ సెక్రటరీ ఆదవ్ అర్జున, పార్టీ హై-లెవల్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ చీఫ్ కో-ఆర్డినేటర్ కేఏ.సెంగోట్టియన్‌తో పాటు ఎ.పార్తీబన్, బి.రాజ్‌కుమార్, కేవీ.విజయ్ దాము, ఎస్‌పీ.సెల్వమ్, కె.పిచాయ్ రత్నం కరికాలన్, ఎం.సెరవు మొహిదీన్ అలియాస్ నియాస్, జే.కేథరిన్ పాండియన్ సభ్యులుగా ఉంటారని విజయ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

విజయ్ సత్తా చూపుతారా..?

తమిళనాడులోని 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కార్యక్రమాలు, సభలు, సమావేశాలు వంటి వ్యవహారాలు ఈ కమిటీ పర్యవేక్షణలోనే జరుగుతాయి. కొత్తగా ఏర్పటైన కమిటీకి పార్టీ కార్యకర్తలు, ఆఫీస్ బేరర్లు పూర్తి సహకారం అందించాలని విజయ్ కోరారు. ఈ పొంగల్‌కి విజయ్‌ నటించిన జన నాయగన్‌ విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్‌ కారణలతో మూవీ వాయిదా పడింది. అయినా కూడా ఏమాత్రం నిరుత్సాహపడకుండా తన పార్టీ పనుల్లో నిమగ్నమయ్యారు. అన్నాడిఎంకె పార్టీతో పాటు తమిళనాడులో తనతో కలిసి వచ్చే నాయకులను పార్టీలో చేర్చుకుంటూ ప్రత్యర్థి పార్టీల గుండెల్లో గుబులు రేపుతున్నారు. దీంతో ఈసారి జరిగే ఎన్నికల్లో అటు DMK, అన్నాDMKతో పాటు TVK బరిలో నిలవడంతో త్రిముఖ పోటీ తప్పేలా లేదు. అయితే కొత్తగా బరిలోకి దిగుతున్న నటుడు విజయ్‌ ఏమేరకు సక్సెస్‌ అవుతారనేది తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.