వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రైతుల ఆందోళనకు డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మద్దతు తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రెండ సార్లు రైతులతో చర్చలు నిర్వహించగా విఫలమయ్యాయి. తాజాగా మూడోసారి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టాలిన్ రైతుల గురించి మాట్లాడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తమిళనాడులోని సేలంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఇప్పటికే మేం కోర్టుకు వెళ్లామని తెలిపారు. తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని ప్రధాని నరేంద్రమోదీ చెప్పుకుంటారని కానీ ఇప్పటి వరకు రైతుల గురించి ఎటువంటి చర్యలు ప్రారంభించలేదని ఆరోపించారు. ప్రధాని నిజంగా రైతు కుటుంబం నుంచి వచ్చినవాడైతే ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలు ఏర్పరిచి వారికి సరైన న్యాయం చేసేవారని ఎద్దేవా చేశారు. డీఎంకే రైతుల ఆందోళనకు సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని ప్రకటించారు. అన్నం పెట్టే రైతన్నకు కనీస మద్దతు ధర కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఈ దేశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పది రోజులుగా రైతులు ధర్నాచేస్తుంటే పట్టించుకునే నాథుడే లేరని మండిపడ్డారు.