MP Cable Car: మధ్యప్రదేశ్‌లో ఆకస్మిక వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సత్నాలో వర్షాల కారణంగా కేబుల్ కార్లు గాలి లోనే నిలిచిపోయాయి. దీంతో అందులో ఉన్న జనం రెండు గంటల సేపు నరకయాతన అనుభవించారు. కరెంట్ సరఫరా పునరుద్దరించిన తరువాత ప్రయాణికులను క్షేమంగా కిందకు దిగారు. దాదాపు 200 మంది భక్తులు కేబుల్ కార్లలో చిక్కుకుపోయారు. ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కారణంగా మధ్యప్రదేశ్‌లో చాలా చోట్ల కరెంట్ సరఫరా నిలిచిపోయింది. సత్నాలో రోప్‌వే నిర్వాహకులు నిర్లక్ష్యం వల్లే కేబుల్ కార్లలో జనం చిక్కుకుపోయారన్న ఆరోపణలు వస్తున్నాయి. మెహర్ పర్వతశ్రేణుల్లో ఉన్న శారదా మాత దర్శనం చేసుకొని వస్తుండగా భక్తులు రోప్‌వేపై ఉన్న కేబుల్ కార్లలో చిక్కుకుపోయారు. దాదాపు 28 కేబుల్ కార్లు రోప్‌వేపై నిలిచిపోవడంతో భక్తులు నరకయాతన అనుభవించారు. శారదామాత మందిరం పర్వతశ్రేణుల్లో ఉండడంతో భక్తుల కోసం రోప్‌వేను ఏర్పాటు చేశారు. కరెంట్ సరఫరా నిలిచిన తరువాత చాలాసేపు అధికారులు స్పందించలేదు. దీంతో భక్తులు చాలా సేపు రోప్‌వే పైనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఘటన జరిగింది.
వీడియో..
#मैहर में आंधी-तूफान के चलते रोप-वे रुका… 28 ट्रॉलियों में करीब 80 श्रद्धालु फंसे#BigBreaking #Satna #Maihar #RopeWay pic.twitter.com/52S7arlrXJ
— Gourav Sharma (@hindgourav) May 23, 2022
ఈ ఘటన జార్ఖండ్ లోని దియోధర్ జిల్లా త్రికూట్ పర్వతాల్లో జరిగిన కేబుల్ కారు ప్రమాదాన్ని గుర్తుకు తెచ్చింది. ఆ ప్రమాదంలో వేగంగా సహాయక చర్యలు చేపట్టినప్పటికీ చాలామంది ప్రాణాలు కోల్పోయారు. సత్నా ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. అయితే ఈ ఘటనలో ప్రయాణికులు క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వర్షం,ఈదురుగాలుల కారణంగానే కరెంట్ సరఫరా నిలిచిపోయిందని , అందుకే కేబుల్ కార్లు గాలిలో చిక్కుకున్నాయని అధికారులు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..