Arvind Kejriwal: ‘అరెస్ట్‌ చేస్తారేమో’.. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ విచారణకు సీఎం కేజ్రీవాల్‌ గైర్హాజరు..

Delhi liquor policy case: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఈడీ విచారణకు హాజరుకాలేదు సీఎం కేజ్రీవాల్‌. ఈడీ నోటీసులు చట్టవిరుద్దమని , ఎన్నికల ప్రచారం కారణంగా విచారణకు హాజరుకాలేకపోతున్నట్టు ఈడీకి రాసిన లేఖలో తెలిపారు కేజ్రీవాల్‌. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరువాత తనను ఈడీ అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arvind Kejriwal: ‘అరెస్ట్‌ చేస్తారేమో’.. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ విచారణకు సీఎం కేజ్రీవాల్‌ గైర్హాజరు..
Arvind Kejriwal
Image Credit source: PTI

Updated on: Nov 02, 2023 | 10:20 PM

Delhi liquor policy case: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు సీఎం కేజ్రీవాల్‌. లిక్కర్‌ స్కామ్‌లో ప్రశ్నించేందుకు కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. లిక్కర్‌ కేసులో ED విచారణకు హాజరుకానంటూ తెగేసి చెప్పిన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, మధ్యప్రదేశ్‌లోని సింగ్రోలిలో ఎన్నికల ప్రచారం చేశారు. ఒక్క కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేయగలరేమోగానీ, వేలు, లక్షలు, కోట్లమంది కేజ్రీవాళ్లను ఎలా అరెస్ట్‌ చేస్తారంటూ నిలదీశారు.

అరెస్ట్‌చేసి, జైల్లో వేస్తే తాను భయపడేవాడిని కాదన్నారు కేజ్రీవాల్‌. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తనను అరెస్ట్‌ చేస్తారేమోనని కేజ్రీవాల్‌ అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం ఉండడంతో విచారణకు రాలేనని, పైగా నోటీసులు చట్టవిరుద్ధమని, తనకు పంపిన సమన్లు వెనక్కి తీసుకోవాలని ఈడీకి లేఖ రాశారు. దీంతో ఆయనకు మరోసారి సమన్లు పంపే యోచనలో ఉన్నారు ఈడీ అధికారులు.

లిక్కర్‌ స్కాం కేసు దర్యాప్తులో భాగంగా నవంబరు 2న తమ ఎదుట హాజరు కావాలంటూ కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. లిక్కర్‌ స్కాంకు సంబంధించిన ఈ ఏడాది ఏప్రిల్‌లోనే కేజ్రీవాల్‌ను ఈడీ ప్రశ్నించింది. కానీ, తొలిసారిగా ఇప్పుడు సమన్లు జారీ చేసి విచారించాలనుకుంటోంది. తనకు పంపిన సమన్లు చట్టవిరుద్ధమని, అవి రాజకీయ ప్రేరేపితమైనవని.. తాను ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకోవడానికే నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. వెంటనే నోటీసుల్ని వెనక్కి తీసుకోవాలని ఈడీని కోరారు.

ఓ వ్యక్తి ఈడీ సమన్లను మూడుసార్లు విస్మరించొచ్చు. ఆ తర్వాత కూడా తిరస్కరిస్తే.. నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ కింద ఈడీ ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేస్తుంది. మనీలాండరింగ్‌ యాక్ట్‌ ప్రకారం కూడా ఈడీ ఒకరికి నోటీసులు జారీ చేయొచ్చు. కేజ్రీవాల్‌కు నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం.. PMLA నిబంధనల కింద ఈ సమన్లు ఇచ్చినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.

గొప్ప నిజాయితీపరుడని చెప్పుకునే కేజ్రీవాల్‌ ఈడీ విచారణకు భయపడి పారిపోయారని బీజేపీ విమర్శించింది. ఢిల్లీ రాజ్‌ఘాట్‌లో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు దీక్ష చేపట్టారు. సీఎం పదవికి కేజ్రీవాల్‌ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..