మధ్యప్రదేశ్ లో రాజకీయ సంక్షోభానికి తెర తీసిన కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా ఢిల్లీలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో మంగళవారం భేటీ అయ్యారు. దీంతో ఇక ఆయన తన మద్దతుదారులతో కలిసి బీజేపీ తీర్థం పుచ్ఛుకోవచ్చన్న ఊహాగానాలకు బలం చేకూరింది.
కాగా.. మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ ప్రభుత్వం మళ్ళీ చిక్కుల్లో పడింది. ఇటీవలే ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బేరసారాలాడి.. తమ ‘బుట్ట’లో వేసుకోవడానికి వారిని గురు గావ్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో రోజంతా నిర్బంధించిన బీజేపీ నేతల ప్రయత్నాన్ని సీఎం కమల్ నాథ్ విజయవంతంగా తిప్పికొట్టగలిగారు. తన ప్రభుత్వ మనుగడకు ఢోకా లేదని నిరూపించుకున్నారు. అయితే ‘గ్వాలియర్ రాజా’ జ్యోతిరాదిత్య సింధియా రూపంలో ఆయన ప్రభుత్వానికి మళ్ళీ గండం వఛ్చి పడింది. కాంగ్రెస్ పార్టీకి 15సంవత్సరాలుగా సేవ చేస్తున్నప్పటికీ..తనకు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తిగా ఉన్న ఆయన.. ఇక రంగంలోకి దిగారు. ఏకంగా తన మద్దతుదారులని భావిస్తున్న 18 మంది ఎమ్మెల్యేలతో చటుక్కున బెంగుళూరు వెళ్లే విమానం ఎక్కేశారు. ఈ నగరంలోని ఫైవ్ స్టార్ హోటల్లో వీరితో కలిసి తన భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకునే పనిలో పడ్డారు. ఈ నాటకీయ పరిణామాల నేపథ్యంలో .. ఆయన ఈ 18 మందితో కమల్ నాథ్ సర్కారుకి మద్దతు ఉపసంహరించుకోవచ్ఛునని బీజేపీ భావిస్తోంది. అదే సమయంలో బీజేపీ ఈ నెల 16 లోగా రాష్ట్ర అసెంబ్లీలో కమల్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే సూచనలు కూడా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అసలే బొటాబొటి మెజారిటీతో నడుస్తున్న కమల్ సర్కార్ కుప్పకూలిపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కమలం పార్టీ పావులు కదపడానికి సిధ్ధంగా ఉంది. మాజీ సీఎం, బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.
జ్యోతిరాదిత్యకు రాజ్యసభ పదవిని కట్టబెట్టి, ఆ తరువాత కేంద్ర మంత్రి పదవిని బీజేపీ ఇవ్వజూపవచ్ఛునని కూడా తెలుస్తోంది.కాగా-కమల్ నాథ్.. బీజేపీ ఎత్తుగడలను ఎదుర్కొనేందుకు తన మంత్రివర్గంలో 20 మంచి చేత రాజీనామాలు చేయించి.. మంత్రివర్గ పునర్వ్యవస్థీ కరణకు పూనుకొన్నారు. అత్యవసరంగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. తాను కూడా మళ్ళీ బీజేపీ వ్యూహాలను ఎదుర్కొనేందుకు ఆయన రెడీ అయ్యారు. జ్యోతిరాదిత్య సింధియాకు స్వైన్ ఫ్లూ సోకి ఉండవచ్ఛునని, అంతేతప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వఛ్చిన ప్రమాదమేమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.