
మహిళలు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలను పెంచే లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దుర్గా ఇ-ఆటో పథకం కింద తొలి దశలో 1,300 గులాబీ రంగు ఎలక్ట్రిక్ ఆటోలను అందించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేతృత్వంలోని మంత్రివర్గం ఆమోదించింది. ఈ పథకం ద్వారా మహిళలకు 1,170 ఆటోలు, ట్రాన్స్‌జెండర్ లబ్ధిదారులకు 130 ఆటోలను కేటాయించనున్నారు. పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించడంతో పాటు ప్రజా రవాణా రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం కూడా దీని లక్ష్యం.
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు.. లాటరీ ద్వారా ఎంపిక
ఈ పథకం కోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. దరఖాస్తులను సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్ నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీలు పరిశీలిస్తాయి. ఈ ప్రక్రియను వారానికోసారి నిర్వహిస్తారు. ఒక జిల్లాలో అర్హులైన దరఖాస్తుదారులు అందుబాటులో ఉన్న కోటా కంటే ఎక్కువగా ఉంటే, ఆన్‌లైన్ లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. తొలి దశలో ప్రతి రెవెన్యూ జిల్లాకు సుమారుగా 90 ఆటోలను మహిళలకు, 10 ఆటోలను ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు కేటాయించనున్నారు. ఎంపికైన వారికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేస్తారు. నమోదు చేసుకున్న యజమానులకు గుర్తింపు కార్డులతో పాటు దుర్గా జాకెట్లు, టోపీలు అందించనున్నారు.
ఈవీ పాలసీ కింద అదనపు ప్రయోజనాలు
ఈ పథకం లబ్ధిదారులకు ఢిల్లీ ఈవీ పాలసీ 2026 కింద వర్తించే కొనుగోలు ప్రోత్సాహకాలు కూడా అందుబాటులో ఉంటాయి. డిజిటల్ మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌లలో చేరేందుకు ఉచిత ఆన్‌బోర్డింగ్, సబ్‌స్క్రిప్షన్ సేవలు కల్పించాలని అగ్రిగేటర్లను కోరనున్నారు. దీంతో డ్రైవర్లు ప్రయాణికులను సులభంగా చేరుకోవడానికి, ఆదాయ అవకాశాలను పెంచుకోవడానికి వీలవుతుంది. అలాగే మెట్రో, నమో భారత్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) స్టేషన్లలో ఈ ఆటోల కోసం ప్రత్యేక పార్కింగ్, ఛార్జింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC), NCRTCలను రవాణా శాఖ కోరింది.
ఈ పథకం ద్వారా మహిళలు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు జీవనోపాధి అవకాశాలు పెరగడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. పథకం ప్రభావాన్ని అంచనా వేసేందుకు లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితి, జీవనోపాధిలో వచ్చిన మార్పులపై రెండు దశల్లో సామాజిక-ఆర్థిక మదింపు కూడా నిర్వహించనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..