సంచలనం రేపిన బ్లూడ్రమ్‌ కేసులో.. ముస్కాన్‌కు, ఆమె ప్రియుడికి మరణశిక్ష

గతేడాది ప్రియుడి సాయంతో ఓ మహిళ తన భర్తను హతమార్చి.. మృతదేహాన్ని బ్లూ డ్రమ్ము సిమెంట్‌తో కప్పేసింది. హత్య కేసులో ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాకు కోర్టు మరణశిక్ష విధించింది. ఇలాంటి నేరాలు సమాజంలో తీవ్ర భయాన్ని సృష్టిస్తాయని న్యాయమూర్తి జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ మిశ్రా పేర్కొన్నారు.

సంచలనం రేపిన బ్లూడ్రమ్‌ కేసులో.. ముస్కాన్‌కు, ఆమె ప్రియుడికి మరణశిక్ష
Meerut Blue Drum Case

Updated on: Oct 14, 2026 | 8:18 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరఠ్‌లో  భర్తను హత్య చేసి.. శవాన్ని 15 ముక్కలుగా నరికి.. డ్రమ్‌లో దాచిన కేసులో మీరట్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో అతడి భార్య ముస్కాన్‌, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాకు ఉరిశిక్ష విధించింది. వెయ్యి పేజీల ఛార్జ్‌షీట్‌, సాక్షుల వాంగ్మూలాలు, సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. 2025 జూలైలో ప్రారంభమైన ఈ కేసు విచారణ దాదాపు 13 నెలల పాటు సాగింది. ప్రస్తుతం నిందితులు ఇద్దరు మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ జైలులో ఉన్నారు. సెప్టెంబర్ 30న వారిని దోషులుగా నిర్ధారించిన కోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది.

గత ఏడాది మార్చిలో మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భార్య ముస్కాన్‌కు సాహిల్ శుక్లాతో వివాహేతర సంబంధమే ఈ దారుణానికి కారణమని దర్యాప్తులో వెల్లడైంది. పక్కా ప్లాన్‌తో సౌరభ్‌ను హత్య చేసిన నిందితులు.. మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికి ప్లాస్టిక్ డ్రమ్‌లో వేసి, సిమెంట్‌తో సీల్ చేశారు. సాక్ష్యాలు లేకుండా చేసి తప్పించుకోవాలని చూసినా.. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. చివరకు నిందితులు కటకటాల వెనక్కి వెళ్లక తప్పలేదు.

సౌరభ్, ముస్కాన్ 2016లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. 2019లోనే వారికి ఒక కుమార్తె కూడా పుట్టింది. ఆ తర్వాత ముస్కాన్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ముస్కాన్ తన లవర్ సాహిల్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు సౌరభ్కు తెలిసింది. దాంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే మార్చి 4న సౌరభ్ తినే ఆహారంలో ముస్కాన్ నిద్రమాత్రలు కలిపింది. ఆపై సాహిల్, ముస్కాన్ కలిసి సౌరభ్ను కత్తితో పొడిచి చంపారు. డెడ్ బాడీని 15 ముక్కలుగా కోసి, డ్రమ్ములో వేసి, సిమెంటుతో సీల్ చేశారు.

హత్య చేసిన మరుసటి రోజే నిందితులు హిమాచల్ ప్రదేశ్ కు పారిపోయారు. రాజ్‌పుత్ బతికే ఉన్నాడని, వ్యాపార పని మీద ప్రయాణం చేస్తున్నాడని నమ్మించేలా ముస్కాన్‌ అతని మొబైల్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సందేశాలు పంపింది. అయితే సౌరభ్ ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2025 మార్చి 17న ఇంటిని తనిఖీ చేయగా సిమెంట్ తో సీల్ చేసిన బ్లూడ్రమ్ దొరికింది. అనుమానం రావడంతో పగలగొట్టి చూడగా సౌరభ్ శరీర భాగాలు కనిపించాయి. దీంతో నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పపించారు. ఇటీవల ముస్కాన్‌ ఆడబిడ్డకు జైల్లోనే జన్మనిచ్చింది. ఈమెకు ఆరేళ్ల పాప కూడా ఉంది.

126 కోర్టు విచారణలు, 22 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మీరట్ జిల్లా కోర్టు వారికి కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. మీరట్ జిల్లా కోర్టు తీర్పుపై నిందితులు హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us