Dead man Returns: ఓ వ్యక్తి మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. అతనికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఆ వ్యక్తి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. సరిగ్గా వారం గడిచిందో లేదో.. ఆ వ్యక్తి నేను బ్రతికే ఉన్నానంటూ ఇంటికి తిరిగొచ్చాడు. దీంతో అందరికీ మతిపోయింది. చనిపోయిన వ్యక్తి బ్రతికి రావడంతో అంతా షాక్ అయ్యారు. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోవర్ధన్ ప్రజాపత్ మృతదేహాన్ని గుర్తించనిదిగా ప్రభుత్వ ఆర్‌కె హాస్పిటల్ ప్రకటించింది. తరువాత ఓంకర్ లాల్ గడులియా అనే వ్యక్తి బంధువులు ఆ మృతదేహాన్ని పొరపాటున స్వాధీనం చేసుకున్నారు. మద్యానికి బానిస అయిన గడులియా మే 11 న తన కుటుంబానికి సమాచారం ఇవ్వకుండా ఉదయపూర్ వెళ్ళాడు. కాలేయానికి సంబంధించిన కొన్ని సమస్యల కారణంగా అక్కడ అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. కరోనావైరస్ ప్రేరిత లాక్డౌన్ తర్వాత గడులియా కుటుంబం తన సోదరుడితో కలిసి నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అదే రోజు, ప్రజాపత్‌ను కొంతమంది ప్రజా ప్రతినిధులు ఏర్పాటు చేసిన అంబులెన్స్ సేవ ద్వారా మోహి ప్రాంతం నుంచి ఆర్కె ఆసుపత్రికి తరలించారు. అతను చికిత్స సమయంలో మరణించాడు.
ఇదిలా ఉండగా మూడు రోజుల పాటు మార్చురీ వద్ద ఒక గుర్తు తెలియని మృతదేహం పడి ఉందని ఆసుపత్రి అధికారుల నుండి పోలీసులకు ఒక లేఖ వచ్చింది. మృతదేహాన్ని గుర్తించడానికి వారు మరణించిన వ్యక్తి యొక్క ఫోటోలు వివిధ రంగాల్లో ప్రచారం చేశారు. ఈ విషయాన్ని కంక్రోలి పోలీస్ స్టేషన్ అధికారి యోగేంద్ర వ్యాస్ పిటిఐకి చెప్పారు. మృతదేహాన్ని గుర్తించడానికి మే 15 న డజను మందికి పైగా ప్రజలు ఆసుపత్రికి వచ్చారని ఆయన చెప్పారు. దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఎటువంటి పోస్ట్‌మార్టం నిర్వహించకుండా మృతదేహాన్ని తమకు అప్పగించాలని లిఖితపూర్వకంగా కోరారు. ఆ మృతదేహం కుడి చేతిపై ఉన్న ఒక మచ్చతో అది గడులియా మృతదేహంగా కుటుంబ సభ్యులు తప్పుగా గుర్తించారు. పోలీసులు ఎటువంటి పోస్ట్‌మార్టం, డిఎన్‌ఎ పరీక్షలు చేయకుండానే మృతదేహాన్ని అప్పగించారు. సాధారణంగా మృతదేహాన్ని ఎవరూ గుర్తించనప్పుడు మాత్రమే డిఎన్‌ఎ పరీక్ష, పోస్ట్‌మార్టం నిర్వహిస్తారు. తరువాత మృతదేహాన్ని దహన సంస్కారాల కోసం పురపాలక సంఘానికి అప్పగిస్తారని వ్యాస్ చెప్పారు.
ఇక గుడులియా మృతదేహంగా భావించిన ఆయన కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని తీసుకు వెళ్లి తుది కర్మలు మే 15నే పూర్తి చేశారు. అయితే, మే 23 న గడులియా ఇంటికి తిరిగి వచ్చాడు. అతను చనిపోయాడని బంధువులు భావించారని తెలిసి షాక్ అయ్యాడు. దీంతో పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించి, గడులియా కుటుంబం దహనం చేసిన మృతదేహాన్ని గవర్ధన్ ప్రజాపత్ మృతదేహంగా గుర్తించారు. ఈ కేసులో పోలీసులు ఎక్కడా తప్పుచేయలేదు. మృతదేహాన్ని ఆసుపత్రి అధికారులు సరిగా గుర్తించలేదని వ్యాస్ తెలిపారు.
ఈ విషయంపై ఆసుపత్రి అధికారులు ఈ సంఘటన మొత్తం నర్సింగ్, మార్చురీ సిబ్బంది తప్పిడంతో జరిగిందని అంగీకరించారు. కరోనా కారణంగా ఆసుపత్రిలో రోగులు భారీగా ఉండటం అదేవిధంగా మార్చురీలో కూడా మృతదేహాలు పేరుకుపోవడంతో ఈ తప్పిదం జరిగిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. నర్సింగ్, మార్చురీ సిబ్బంది మధ్య సమన్వయ లోపం కారణంగా ఈ సంఘటన జరిగింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని ఆర్‌కె ఆసుపత్రి ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ లలిత్ పురోహిత్ తెలిపారు. ఇకపోతే, మరణించిన గోవర్ధన్ ప్రజాపత్ కు ముగ్గురు పిల్లలు ఉన్నారు, అతని ఆరోగ్యం క్షీణించిన తరువాత ఒక సంక్షేమ గృహానికి అతన్ని పంపించారు. అతని ఆరోగ్య సమస్యల కారణంగా అతని భార్య అతనిని విడిచిపెట్టిందని పోలీసులు తెలిపారు.
Also Read: Rahul gandhi: కరోనా మరణాలపై కేంద్రం చెబుతున్నది పచ్చి అబద్ధం.. రాహుల్ గాంధీ ఆరోపణ