బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో భారతీయ జనతాపార్టీ తాయిలాలు మొదలు పెట్టేసింది.. క్రితంసారి ఎన్నికలప్పుడు బీహార్‌కు లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఈసారి ఇంకో ఎయిమ్స్‌ను ప్రకటించింది.. ఇది ఓటర్లను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నమేనని అంటున్నాయి విపక్షాలు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం 1,264 కోట్ల రూపాయలతో దర్భంగా దగ్గర ఎయిమ్స్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రాష్ట్ర రాజధాని పాట్నాలో ఆల్‌రెడీ ఎయిమ్స్ ఉంది.. 750 పడకల ఆసుపత్రితో పాటు దర్భంగా ఎయిమ్స్‌లో మెడికల్, నర్సింగ్ కళాశాలలు కూడా ఉంటాయి. వంద ఎంబీబీఎస్ సీట్లు కలిగిన మెడికల్ కాలేజీ, 60 బీఎస్సీ-నర్సింగ్ సీట్లతో నర్సింగ్ కాలేజీ కూడా ఉంటుంది. తరువాత పీజీ, డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ కూడా మొదలుపెడతారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సరక్ష యోజన కింద దర్భంగాకు ఎయిమ్స్ కేటాయించారు . ఎయిమ్స్ నిర్మాణపు ఖర్చులను కేంద్రమే భరిస్తుంది. కొత్త ఎయిమ్స్‌తో దర్భాంగా, పరిసర ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు అభివృద్ధి చెందుతాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.