
కరోనాను చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. కరోనా వస్తే ఏమౌతుందిలే.. ఇప్పటికే రెండు సార్లు చూశాం అంటున్నారు. కానీ పరిస్థితి అలా లేదు. దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన మహమ్మారి, ఇప్పుడు మళ్లీ విజృంభిస్తుండటంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది, మరణాలు కూడా నమోదవుతున్నాయి. అత్యధికంగా కేరళలో కరోనా సంక్రమణ కన్పిస్తోంది. ప్రస్తుతం కేరళలో పాజిటివ్ కేసులు 1500 దగ్గరలో ఉన్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ ఇలా ఒక్కో రాష్ట్రంలో 500పైగా కేసులు నమోదయ్యాయి. కర్నాటక, తమిళనాడులోనూ యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి.
ఇదేమీ లైట్ తీసుకోవాల్సిన విషయంగా కనిపించటం లేదని.. ప్రభుత్వ లెక్కలతోనే తెలుస్తోంది. పరీక్షలు చేయించుకోని వారు ఇంకెంత మంది ఉన్నారో.. జలుబు, దగ్గు, జ్వరంగా మామూలే కదా అంటూ ట్యాబ్లెట్లు వాడుతున్న వారు ఇంకెంత మంది ఉన్నారో అనే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
దేశ వ్యాప్తంగా కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుండటంతో తెలుగు రాష్ట్రాలకు కూడా అలర్ట్ అయ్యాయి. ఏపీ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కొవిడ్ ప్రత్యేక వార్డులు, స్క్రీనింగ్ సెంటర్లను ప్రారంభించారు. కొవిడ్ పరీక్షలను కూడా పెంచాలని వైద్యారోగ్య శాఖ నుంచి ఆదేశాలొచ్చాయి. జ్వరం, దగ్గు, జలుబుతో ఎవరు వచ్చినా టెస్టులు తప్పనిసరి చేస్తున్నారు. కొవిడ్ టెస్టులకు అవసరమయ్యే వైరల్ ట్రాన్స్‌మిషన్ మీడియా కిట్లు, RNA ఎక్స్‌ట్రాక్షన్ కిట్లు, RTPCR కిట్లు అందుబాటులో ఉంచుతున్నారు. కొవిడ్ పాజిటివ్ అని తేలితే ఐసోలేషన్ వార్డ్స్‌లో పెడుతున్నారు. ఇక తెలంగాణలో కొవిడ్ కంట్రోల్‌లోనే ఉంది. అయితే, కొవిడ్ కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే.. ఒకవేళ కేసుల సంఖ్య పెరిగినా సరే వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఉన్నామన్నారు అధికారులు. ఇప్పటికే ఆక్సీజన్ సిలిండర్లు, బెడ్లు, కావాల్సిన అన్ని సదుపాయాలతో రెడీగా ఉన్నామన్నారు. అన్ని జిల్లాలకు గైడ్‌లైన్స్ కూడా పంపించారు. మొత్తంగా ప్రస్తుతానికైతే.. ఆందోళన అక్కర్లేదని చెబుతున్న సైంటిస్టులు.. ఒక వార్నింగైతే ఇస్తున్నారు. ఫస్ట్‌వేవ్, సెకండ్ వేవ్‌లో కొవిడ్ కేసులు ఒకట్రెండు రోజుల్లోనే రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు కూడా అలాగే జరిగితే మాత్రం.. మరింత అప్రమత్తత అవసరమని చెబుతున్నారు. బీ కేర్ ఫుల్.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.