Covid-19 Vaccine:దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. అయితే కోవిడ్ టీకా తీసుకోవడం వల్ల తలెత్తే దుష్ర్పభావాలకు సంబంధించి ఎలాంటి బీమా సదుపాయం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. స్వచ్చంధంగానే లబ్దిదారు ఆ టీకాను తీసుకొవచ్చని ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే వెల్లడించారు. కాగా, టీకా వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలకు బీమా సదుపాయం అందుబాటులో ఉందా.? అని రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు మంగళవారం ఈ సమాధానం ఇచ్చారు.
కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత ఎదురయ్యే సమస్యలకు తగ్గట్టుగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని అన్నారు. ప్రతి టీకా కేంద్రం వద్ద అనాఫిలాక్సిన్ కిట్లు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. టీకా తీసుకున్న వ్యక్తిని 30 నిమిషాల పాటు పరిశీలనలో ఉంచుతామని వివరించారు. టీకా తీసుకున్నాక ఎదురయ్యే సమస్యలకు సంబంధించి ప్రజా ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
అలాగే కొవిషీల్డ్ , కోవాగ్జిన్ వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో ఫిబ్రవరి 4 వరకు వెలుగు చూసిన ఏఈఎఫ్‌ఐ కేసుల సంఖ్యను ఆయన సభలో ప్రస్తావించారు. ఇప్పటి వరకు కోవాగ్జిన్ తీసుకున్నవారిలో 81 మందికి ప్రతికూల ప్రభావాలు కనిపించాయని, అది 0.096 శాతంగా ఉందన్నారు. కొవిషీల్డ్‌కు సంబంధించి 8,402 మందిలో దుష్ర్పభావాలు కనిపించాయని చాలా మందిలో ఆందోళన, మైకం, జ్వరం, నొప్పి, దద్దుర్లు, తలనొప్పి తదితర చిన్నపాటి సమస్యలు ఎదురైనట్లు చెప్పారు. జనవరి 16న మొదలైన టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు కేంద్రం 60 లక్షలకుపైగా టీకాలు పంపిణీ చేసింది.
Also Read: పూర్తిగా తగ్గుముఖం పట్టినా కరోనా మహమ్మారి.. 15 రాష్ట్రాల్లో కరోనా మరణాలు లేవు: కేంద్ర ఆరోగ్యశాఖ