Mammootty: మమ్ముట్టికి సీఎం విజయన్ క్షమాపణలు.. అసలు ఏం జరిగిందంటే..?

వయనాడ్ ప్రజల కష్టాలను స్వయంగా చూడాలని వెళ్లిన మెగాస్టార్ మమ్ముట్టికి అక్కడ ఒక ఊహించని చేదు అనుభవం ఎదురైంది. పార్టీ రంగు పులుముకోకూడదని ఆయన చేసిన ఒక సున్నితమైన విన్నపాన్ని వివాదంగా మలిచి.. సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాలపై స్వయంగా సీఎం పినరయి విజయన్ స్పందిస్తూ.. మెగాస్టార్‌కు సారీ చెప్పారు.

Mammootty: మమ్ముట్టికి సీఎం విజయన్ క్షమాపణలు.. అసలు ఏం జరిగిందంటే..?
Cm Pinarayi Vijayan Apologizes To Mammootty

Updated on: Mar 09, 2026 | 9:55 PM

కేరళ రాజకీయాల్లో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. వయనాడ్ టౌన్‌షిప్ సందర్శన సమయంలో మమ్ముట్టి ఎదుర్కొన్న చేదు అనుభవాలు, ఆయనపై జరిగిన సోషల్ మీడియా దాడుల పట్ల సీఎం తీవ్రంగా స్పందించారు. ఇటీవల మెగాస్టార్ మమ్ముట్టి వయనాడ్ పునరావాస పట్టణాన్ని సందర్శించారు. చెన్నై నుండి నేరుగా వచ్చిన ఆయన.. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా అత్యంత సాదాసీదాగా ఈ పర్యటన ముగించాలనుకున్నారు. అయితే ఈ పర్యటనలో సీపీఎం జిల్లా కార్యదర్శి కె. రఫీక్ ఆయనతో పాటు ఉండటం వివాదానికి దారితీసింది. మమ్ముట్టి తన సందర్శనను పార్టీ రంగు పులుముకోకుండా ఉండాలని కోరుకున్నప్పటికీ, కొందరు దీనిని వివాదంగా మలిచారు.

సోషల్ మీడియాలో విమర్శల కలకలం

పర్యటన సమయంలో మమ్ముట్టి.. రఫీక్‌తో ఏకాంతంగా మాట్లాడుతూ.. ‘‘నువ్వు నా పక్కనే ఉంటే నేను నీ కోసమే ఇక్కడికి వచ్చానని జనం అనుకుంటారు. దయచేసి కాస్త దూరంగా ఉండు’’ అని చాలా సున్నితంగా కోరారు. అయితే అక్కడ ఉన్న హిడెన్ కెమెరాలు ఈ సంభాషణను రికార్డ్ చేశాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీపీఎం అనుకూల సైబర్ కార్యకర్తలు మమ్ముట్టిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు, దుర్భాషలతో విరుచుకుపడ్డారు. ఈ పరిణామాలతో కలత చెందిన మమ్ముట్టి నేరుగా కె. రఫీక్‌కు ఫోన్ చేసి తన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రఫీక్ ఫేస్‌బుక్ ద్వారా ఈ వివాదానికి ముగింపు పలకాలని అభ్యర్థించారు.

సీఎం ఏమన్నారంటే?

పరిస్థితి తీవ్రతను గమనించిన ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి మమ్ముట్టికి మద్దతుగా నిలిచారు. “మమ్ముట్టి పర్యటన కేవలం వయనాడ్ మంచి కోరి చేసినదే. ఆయన పడ్డ బాధకు నేను చింతిస్తున్నాను. కేరళ గౌరవాన్ని పెంచే మమ్ముట్టి లాంటి గొప్ప నటుడిపై సోషల్ మీడియా దాడులు జరగడం అత్యంత దురదృష్టకరం. “ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆయనను బాధపెట్టి ఉంటే దానికి ముఖ్యమంత్రిగా నేను బహిరంగంగా క్షమాపణలు కోరుతున్నాను’’ అని ప్రకటించారు.

రాజకీయాలకు అతీతంగా కేరళ ప్రజలందరూ గౌరవించే వ్యక్తిపై జరిగిన ఈ సైబర్ దాడిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మమ్ముట్టి కేరళ శ్రేయస్సును కోరుకునే వ్యక్తి అని ఆయనను అవమానించడం తగదని సీఎం స్పష్టం చేయడంతో ఈ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగినట్లు కనిపిస్తోంది.

Follow Us