కొత్త మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం అమలులోకి వచ్చిన భారీ జరిమానాలు దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నాయి. వాహనదారులు ఫైన్‌లను కట్టలేక.. నానా అవస్థలు పడుతున్నారు. ఇక తాజాగా జార్ఖండ్‌లోని రాంచీలో ఓ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ హెల్మెట్ ధరించలేదని రూ.34 వేలు జరిమానా విధించడం సోషల్ మీడియా అంతటిని షాక్‌కు గురి చేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. రాంచీకి చెందిన రాకేష్ కుమార్ ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడు ఒక రోజు హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతూ ట్రాఫిక్ సిబ్బంది కంటపడ్డాడు. అంటే ఇంకేముంది కొత్త మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం రూ. 34 వేల జరిమానాను విధించారు. రాకేష్ కుమార్ హెల్మెట్ ధరించకపోవడంతో పాటు.. ఇతర నిబంధనలను కూడా ఉల్లఘించడం వల్లే ఇంత భారీ జరిమానా విధించాల్సి వచ్చిందని పోలీసులు చెప్పుకొచ్చారు.