రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. వ్యవసాయంలో డిజిటల్ విప్లవం.. అన్ని మీ అరచేతిలో..!

దేశంలో ఎరువుల పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సులభంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. రైతులు ఎరువుల కోసం దుకాణాల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితిని తగ్గిస్తూ, ముందుగానే అవసరమైన ఎరువులను బుక్ చేసుకునేలా కొత్త ఫెర్టిలైజర్ యాప్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ వ్యవస్థ దేశవ్యాప్తంగా ఒకే విధానంలో అమలయ్యే అవకాశం ఉంది.

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. వ్యవసాయంలో డిజిటల్ విప్లవం.. అన్ని మీ అరచేతిలో..!
Fertilizer Booking App

Edited By:

Updated on: Aug 04, 2026 | 11:13 AM

దేశంలో ఎరువుల పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సులభంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. రైతులు ఎరువుల కోసం దుకాణాల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితిని తగ్గిస్తూ, ముందుగానే అవసరమైన ఎరువులను బుక్ చేసుకునేలా కొత్త ఫెర్టిలైజర్ యాప్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ వ్యవస్థ దేశవ్యాప్తంగా ఒకే విధానంలో అమలయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో రైతులు నేరుగా ఎరువుల దుకాణాలకు వెళ్లి అందుబాటులో ఉన్న స్టాక్ ఆధారంగా కొనుగోలు చేస్తున్నారు. అయితే కొత్త విధానంలో ముందుగా మొబైల్ యాప్‌లోనే ఎరువులను రిజర్వ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. బుకింగ్ పూర్తయిన తర్వాత నిర్ణయించిన తేదీ, సమయానికి సంబంధిత డీలర్ వద్దకు వెళ్లి ఎరువులను పొందేలా వ్యవస్థ రూపొందిస్తున్నారు. దీంతో రద్దీ తగ్గడమే కాకుండా పంపిణీ మరింత క్రమబద్ధంగా జరిగే అవకాశముంది.

ఈ యాప్‌ను ఉపయోగించేందుకు రైతులు ముందుగా ఆధార్ నంబర్‌తో నమోదు చేసుకోవాలి. ఓటీపీ ద్వారా ధృవీకరణ పూర్తయ్యాక భూమి విస్తీర్ణం, సాగు చేస్తున్న పంట, అవసరమైన ఎరువుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం సమీపంలోని ఎరువుల డీలర్‌ను ఎంపిక చేసుకుని అవసరమైన ఎరువులను బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ పూర్తయ్యాక క్యూఆర్ కోడ్‌తో పాటు నిర్ధారణ సందేశం మొబైల్‌కు వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్‌ను డీలర్‌కు చూపించి ఎరువులు తీసుకోవాల్సి ఉంటుంది.

కొత్త యాప్‌లో మరో ముఖ్యమైన సౌకర్యం కూడా ఉండనుంది. రైతులకు సమీపంలోని ఎరువుల దుకాణాల్లో ఏ ఎరువు ఎంత పరిమాణంలో అందుబాటులో ఉందో ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో స్టాక్ లేని దుకాణాలకు వెళ్లి సమయం వృథా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అవసరమైన ఎరువు ఎక్కడ ఉందో తెలుసుకుని నేరుగా అక్కడే బుక్ చేసుకునే వీలుంటుంది.

ఎరువుల పంపిణీని పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (IFMS)ను అమలు చేస్తోంది. రాష్ట్రాల వారీగా ఎరువుల అవసరాన్ని అంచనా వేయడం, సబ్సిడీ నిర్వహణ, నిల్వల పర్యవేక్షణ, కొరత నివారణ, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను నియంత్రించడంలో ఈ వ్యవస్థ కీలకంగా పనిచేస్తోంది. ఇప్పుడు తీసుకొస్తున్న కొత్త యాప్‌ను కూడా ఈ వ్యవస్థతో అనుసంధానం చేయాలని కేంద్రం భావిస్తోంది.

తెలంగాణలో ప్రస్తుతం యూరియా పంపిణీ కోసం ప్రత్యేకంగా యూరియా యాప్ అమల్లో ఉంది. ప్రారంభంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురైనా, తర్వాత యూరియా పంపిణీని క్రమబద్ధీకరించడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషించింది. రైతులు అవసరమైన యూరియాను సులభంగా పొందేందుకు ఈ విధానం ఉపయోగపడిందని అధికారులు చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా ఒకే తరహా విధానాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొత్త ఫెర్టిలైజర్ యాప్‌ను తీసుకొస్తుండటంతో, రాష్ట్రాల్లో అమలవుతున్న ప్రత్యేక యాప్‌ల అవసరం తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న యూరియా యాప్‌ను రద్దు చేసి, కేంద్రం రూపొందిస్తున్న కొత్త వ్యవస్థనే అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో ఈ యాప్‌ను దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరగడంతో పాటు రైతులకు సమయానుకూలంగా ఎరువులు అందడం, పంపిణీలో గందరగోళం తగ్గడం, బ్లాక్ మార్కెటింగ్‌పై మరింత సమర్థంగా నియంత్రణ సాధించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us