ICU: ఇకపై ఐసీయూలో చేరడం రోగి ఇష్టం.. కేంద్రం కీలక మార్గదర్శకాలు..

అంతే కాకుండా, మహమ్మారి, విపత్తు పరిస్థితులు, వనరులు పరిమితంగా ఉన్న సమయంలో రోగిని ఐసీయూలో ఉంచడానికి తక్కువ ప్రాధాన్యతగా పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. 24 మంది నిపుణులతో కూడిన కమిటీ ఈ మార్గదర్శకాలను రూపొందించింది. విపత్తు సమయంలో వనరులు పరిమితంగా ఉంటే..

ICU: ఇకపై ఐసీయూలో చేరడం రోగి ఇష్టం.. కేంద్రం కీలక మార్గదర్శకాలు..
ICU Admit

Updated on: Jan 03, 2024 | 7:50 AM

రోగులను ఐసీయూల్లో చేర్చడంపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రోగులు లేదా వారి బంధువులు ఐసీయూల్లో చేరడాన్ని నిరాకరిస్తే ఆసుప్రత్రి వర్గాలు సదరు రోగులను ఐసీయూల్లో చేర్చుకోకూడదని కేంద్రం తన మార్గదర్శకాల్లో తెలిపింది. ఎంత చికిత్స చేసినా ఫలితం లేని సమయంలో ఐసీయూలో ఉంచడం వృథా అని చెప్పుకొచ్చారు. మనిషి జీవించే అవకాశం లేనప్పుడు ఐసీయూల్లో చేర్చుకోకూడదని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

అంతే కాకుండా, మహమ్మారి, విపత్తు పరిస్థితులు, వనరులు పరిమితంగా ఉన్న సమయంలో రోగిని ఐసీయూలో ఉంచడానికి తక్కువ ప్రాధాన్యతగా పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. 24 మంది నిపుణులతో కూడిన కమిటీ ఈ మార్గదర్శకాలను రూపొందించింది. విపత్తు సమయంలో వనరులు పరిమితంగా ఉంటే.. ఐసీయూలో చేర్చడానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. ఇక ఒకవేళ ఐసీయూ చికిత్సలు వద్దనుకునే వారు, ఆ మేరకు లివింగ్‌ లివ్‌ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి రాసి ఇచ్చిన వారిని ఐసీయూలో చేర్చుకోకూడదు.

ఇక రోగులను ఐసీయూలో చేర్చడానికి కూడా కొన్ని ప్రమాణాలను మార్గదర్శకాల్లో సిఫార్స్‌ చేశారు. రక్తప్రసరణ వ్యవస్థలో అస్థిరత, శ్వాస వ్యవస్థకు తోడ్పాటు అవసరమైన వారు, తీవ్ర అనారోగ్యం కారణంగా నిశిత పర్యవేక్షణ అవసరమైన రోగులు, ఏదైనా అవయవానికి తోడ్పాటు అవసరం కావడం, అవయవ వైఫల్యం, ఆరోగ్య పరిస్థితి క్షీణించే అవకాశమున్న వ్యాధులతో బాధపడేవారిని ఐసీయూల్లో చేర్చుకోవాలని తెలిపింది.

ఇక గుండె సమస్య లేదా శ్వాసకోశ వ్యవస్థ పనితీరులో హెచ్చుతగ్గులు, పెద్దస్థాయి శస్త్రచికిత్స చేయించుకొని ఉండటం వంటివి కూడా ఐసీయూల్లో చేర్చుకోవడానికి కారణాలుగా పరిగణించాలని కేంద్రం తెలిపింది. ఇక రోగుల బీపీ, బ్రీతింగ్‌ రేట్‌, హార్ట్‌ బీట్‌, శ్వాస తీసుకుంటున్న తీరు, ఆక్సిజన్‌ శాచురేషన్‌, మూత్ర పరిమాణం, నాడీ వ్యవస్థ పనితీరు వంటి వాటిని పరిగణలోకి తీసుకొని ఐసీయూలో చేర్చాలా వద్ద అన్న నిర్ణయం తీసుకోవాలని కేంద్ర సూచించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..