సీబీఎస్ఈ పాఠశాలల్లో బోధనపై మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఇందులో ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే బోధన జరుగుతోంది. అయితే తాజాగా ఈ బోర్డు తెలుగుతో సహా 22 భాషల్లో బోధించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఆదివారం ఓ ప్రకటన చేసింది. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాంతీయ, మాతృ భాషల్లో బోధన ఉంటే భాషాపరమైన వైవిధ్యం.. సమగ్రమైన బోధన అనుభవం వస్తుందని పేర్కొన్నారు. ఇంగ్లీష్, హింది భాషలతో పాటు ఇతర భాషల్లో కూడా బోధనకు పరిగణించాలని ఇటీవలే సీబీఎస్‌ఈ ఓ సర్కులర్ విడుదల చేసి తమ పాఠశాలలు సూచించింది.
అయితే విద్యావ్యవస్థలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం కల్పించాలని జాతీయ విద్యావిధానం మార్గదర్శకాలను అనుసరించే సీబీఎస్‌ఈ బోర్టు ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. మాతృభాషలో నేర్చుకుంటే విద్యార్థులకు పాఠాలు బాగా అర్థమవుతాయని దీంతో వారు మరింత మెరుగ్గా రాణించగలుగుతారని పేర్కొన్నారు. మరోవైపు ఈ మార్పులకు అనగూణంగా ఎన్‌సీఈఆర్‌టీ సైతం 22 భాషల్లో పాఠ్య పుస్తకాలను త్వరలోనే తీసుకురానుంది.